
‘టీ’ నోట్ వచ్చేనా!?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం గురువారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చకు వస్తుందా, లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశ అజెండాలో ఈసారి కూడా తెలంగాణ అంశానికి చోటు లభించలేదు గనుక అదేమీ చర్చకు రాకపోవచ్చని అధికార వర్గాలంటున్నాయి. మంత్రివర్గ పరిశీలనకు కేంద్ర హోం శాఖ సమర్పించాల్సిన కేబినెట్ నోట్ ఇంకా సిద్ధం కాకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. హైద్రాబాద్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పాటు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వైద్య పరీక్షల కోసం ఐదారు రోజులుగా ముంబైలో ఉండటం వల్ల నోట్ ఇంతవరకూ ఖరారు కాలేదని ఆ వర్గాలు తెలిపాయి.
అంతేగాక సీమాంధ్రుల సందేహాలు, ఆందోళనను ఆలకించేందుకు కాంగ్రెస్ వేసిన కమిటీ చైర్మన్, రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ ప్రొస్టేట్ గ్రంథి శస్త్ర చికిత్స చేయించుకోవడం తెలిసిందే. ఆయన మరో రెండు మూడు రోజుల దాకా విధులకు హాజరయ్యే అవకాశం లేదు. దాంతో రాజధాని వివాదం కూడా ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కన్పించడం లేదు. గత శుక్రవారం జరిగిన కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంలో తెలంగాణపై కొంత చర్చ జరిగినా దానికి షిండే హాజరవకపోవడం, ఆంటోనీ కమిటీ సంప్రదింపుల ప్రక్రియ పూర్తవకపోవడమే గాక హైద్రాబాద్ ప్రతిపత్తి, నదీజలాలు, విద్యుత్, ఆదాయ పంపిణీ వంటి కీలక సమస్యలపై తుది నిర్ణయమేదీ తీసుకోలేకపోయారని చెబుతున్నారు.
మరో డ్రామా!: మరోవైపు, ప్రకటనే తప్ప రాష్ట్ర ఏర్పాటుపై పురోగతేమీ లేని వైనంపై తెలంగాణవాదులు, ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతున్న వైనం కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపరుస్తున్నట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షలకు అమెరికా వెళ్లిన సోనియాగాంధీ తిరిగి రాగానే విభజన ప్రక్రియ ఊపందుకుంటుందంటూ ఊదరగొట్టినా, అదంతా ఉత్తదేనని తేలిపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. అలాగని సీమాంధ్రలో నానాటికీ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని చూస్తూ చూస్తూ ఎలాంటి ముందడుగూ వేయలేని సందిగ్ధావస్థలో కాంగ్రెస్ పెద్దలు కొట్టుమిట్టాడుతున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఏర్పాటు దిశగా ఏదో ఒక ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నాలకు కూడా కాంగ్రెస్ తెర తీస్తోందని వినిపిస్తోంది.
అందులో భాగంగా రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందాన్ని (జీఓఎం) ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. అయితే అందుకు కేబినెట్‌కు నోట్ తప్పనిసరి గనుక గురువారం మంత్రివర్గ భేటీలో ఆ నోట్‌ను సమర్పిస్తారని కూడా హస్తినలో ప్రచారం జరుగుతోంది. కాకపోతే వివాదాస్పద అంశాల్లో వేటి జోలికీ పోకుండా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానానికే నోట్ పరిమితం కావచ్చని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. తర్వాత విభజనకు సంబంధించిన అన్ని సమస్యలనూ జీఓఎం భుజాలపైకి నెట్టి చేతులు దులుపుకోవాలన్నదే ఏఐసీసీ వ్యూహకర్తల ఆంతర్యమని భావిస్తున్నారు! కాకపోతే ఎలాంటి కసరత్తూ లేకుండా ఉన్నపళంగా మంత్రివర్గానికి గురువారమే నోట్ సమర్పించడం ఏ మేరకు సాధ్యమన్న అనుమానాలు కూడా ప్రబలంగానే వ్యక్తమవుతున్నాయి. నోట్ రూపకల్పనలో పలు దశలుంటాయి. ముందుగా అన్ని వివరాలతో నోట్ ముసాయిదాను కేంద్ర హోం శాఖ రూపొందించాల్సి ఉంటుంది. తర్వాత న్యాయ తదితర శాఖల వద్దకు వెళ్తుంది. వాటి అభిప్రాయాలు, సూచనలను కూడా పొందుపరిచాక కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌కు వెళ్లాలి. అప్పుడు దాన్ని తదుపరి మంత్రివర్గ అజెండాలో చేరుస్తారు. ఇవేమీ లేకుండానే తెలంగాణ నోట్‌ను నేరుగా గురువారం నాటి భేటీలో ఉంచడం ఏ మేరకు సాధ్యమని కాంగ్రెస్ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి.
ప్రస్తుతానికి నాన్చుడే...
విభజనలో ఇమిడి ఉన్న సంక్లిష్ట, వివాదాస్పద అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పట్లో ఎలాంటి నిర్ణయమూ తీసుకునే అవకాశాలు లేవంటున్నారు. కనీసం అక్టోబర్‌ద్వితీయార్ధం దాకా దీన్నిలాగే సాగదీస్తారని ఆ పార్టీ వర్గాలే అంచనా వేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ సెప్టెంబర్ 26న అమెరికా వెళ్తున్నారు. నెలాఖరులో ఆయన తిరిగి రానున్నారు. అక్టోబర్ ప్రథమార్ధంలో కూడా ప్రధాని మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. కాబట్టి ఎలా చూసినాఅక్టోబర్ 15-20 తేదీల దాకా సమస్యను ఇలాగే నానబెడతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సీమాంధ్ర నేతల ఎదురుచూపులు
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల అపాయింట్‌మెంట్ కోసం సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు హస్తినలో ఎదురుతెన్నులతో కాలం గడుపుతున్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రి పల్లంరాజు ద్వారా వారు పంపిన అభ్యర్థనలకు మంగళవారం సాయంత్రం దాకా ఏ స్పందనా రాలేదని తెలియవచ్చింది. ఆలోగా ఆంటోనీ కమిటీ సభ్యులను కూడా కలవాలనుకున్నా ఆయనింకా ఆస్పత్రిలోనే ఉండటంతో సాధ్యపడలేదని సమాచారం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా ఢిల్లీలో లేరు.