
శీతాకాలమూ మునిగింది
ముగిసిన పార్లమెంటు సమావేశాలు
♦ ఉభయ సభల్లో నిరసనలు, ఆందోళనలదే రాజ్యం
♦ లోక్‌సభలో 13, రాజ్యసభలో 9 బిల్లులకు ఆమోదం
♦ పెండింగ్‌లో జీఎస్‌టీ సహా పలు కీలక బిల్లులు
న్యూఢిల్లీ: నిరసనలు, గందరగోళం, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్జీవంగా ముగిశాయి. వర్షాకాల సమావేశాల్లాగే ఈసారీ విపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. కీలక బిల్లులకు ఆమోదం పొందాలనుకున్న ప్రభుత్వానికి.. రాజ్యసభలో కాంగ్రెస్ ఊపిరిసలపనివ్వలేదు. అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 26ను రాజ్యాంగ దినంగా ప్రకటిస్తూ.. రాజ్యాంగంపై చర్చతో ఈ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సెషన్లో తొలి రెండురోజులే సభ సజావుగా జరిగింది. మూడో రోజు నుంచీ గందరగోళమే రాజ్యమేలింది. 2016, ఏప్రిల్ 1 నుంచి అమలు చేద్దామనుకున్న కీలకమైన జీఎస్‌టీతోపాటు పలు బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఆత్మవిమర్శ చేసుకోవాలి: అన్సారీ
రోజూ నిరసనలు, ఆందోళనలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంటు జరిగిన తీరుపై రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ బుధవారం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. 20 రోజుల సమావేశాల్లో రాజ్యసభ 47 గంటల సమయం విపక్షాల ఆందోళనలకే సరిపోయిందన్నారు. సమావేశాలను అడ్డుకోవటంపై సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. గతవారం ఒక్క గంట కూడా రాజ్యసభ నడవలేదని గుర్తుచేశారు. ‘ప్రజాసమస్యలపై మన చిత్తశుద్ధిని ఈ సమావేశాలు ప్రతిబింబిస్తాయి. సభ్యులు సహేతుకంగా వ్యవహరించాలి. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసే అవకాశాన్ని సభ్యులు కోల్పోవద్దు’ అన్నారు. సభ్యుల భాష, చేతల వల్ల పార్లమెంటు కార్యక్రమాలకు విఘాతం కలగటంతోపాటు వారి వ్యక్తిగత హక్కులకూ భంగం వాటిల్లుతుందన్నారు.
లోక్‌సభే కాస్త మేలు.. సమావేశాల్లో రచ్చజరిగినా.. లోక్‌సభ పర్వాలేదన్నట్లుగా.. 13 బిల్లులను ఆమోదించింది. రాజ్యసభ 9 బిల్లులకే ఆమోదం తెలిపింది. అదీ చివరి రోజు మూడు బిల్లులను చర్చ లేకుండానే.. నిమిషాల్లోనే ఆమోదించింది. మంగళవారం కీలకమైన జువనైల్ జస్టిస్ బిల్లు విషయంలో.. ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని కాంగ్రెస్ ముందడుగేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వరదలపై సభలో స్వల్పకాల చర్చ జరిగింది. కేంద్ర మంత్రి వీకే సింగ్ రాజీనామా డిమాండ్, నేషనల్ హెరాల్డ్‌కేసులో సోనియా, రాహుల్‌లకు ఢిల్లీ కోర్టు సమన్లు, డీడీసీఏ వివాదం తదితరాలు రాజ్యసభను కుదిపేశాయి.
స్పీకర్ విచారం.. మంగళవారం కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై (స్వార్థ ప్రయోజనాల కోసమే సభను అడ్డుకుంటున్నారని) సమావేశాల చివరి రోజు స్పీకర్ సుమిత్రా మహాజన్ విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ‘కాంగ్రెస్ సభ్యుల మనోభావాలు దెబ్బతిన్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. అయితే వారి చేతల ద్వారా ఇతరుల మనోభావాలు కూడా దెబ్బతింటున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని అన్నారు. అంతకుముందు ఉభయసభలు ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాద మృతులకు సంతాపం తెలిపాయి.
ఆమోదం పొందిన ముఖ్యమైన బిల్లులు
లోక్‌సభలో.. బోనస్ బిల్లు, దివాలా బిల్లు, మధ్యవర్తిత్వ-ఒప్పంద సవరణ బిల్లు, అణుశక్తి బిల్లు, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ బిల్లు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిల్లు, పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు
రాజ్యసభలో.. జువనైల్ జస్టిస్ బిల్లు, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ బిల్లు, కమర్షియల్ కోర్టులు-కమర్షియల్ డివిజన్ బిల్లు, మధ్యవర్తిత్వ-ఒప్పంద సవరణ బిల్లు, బోనస్ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు.
మోదీ పనిచేస్తే.. కాంగ్రెస్ ఔట్: వెంకయ్య
మరోవైపు, పార్లమెంటు వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సభల్లో కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ సభలను స్తంభింపజేసిందన్నారు. ప్రధాని మోదీ సరిగా పనిచేస్తే.. వారికి భవిష్యత్తు ఉండదనే భయంతోనే.. సంస్కరణలను అడ్డుకుంటున్నారన్నారు. కాగా, ప్రభుత్వం దేశంలో తమ పార్టీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంటు సమావేశాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారన్న బీజేపీ వార్తల్లో వాస్తవం లేదని రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు.
బోనస్ బిల్లుపై దత్తాత్రేయ హర్షం
ఉభయ సభల్లో బోనస్ చెల్లింపు సవరణల బిల్లు ఆమోదం పొందడంపై కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం తన శాఖ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. దత్తాత్రేయకు బీఎంఎస్ నేతలు మిఠాయిలు తినిపించారు.
‘యూపీ’ కోసమే తెరపైకి అయోధ్య
రాజ్యసభలో విపక్షాల ధ్వజం
అధికార బీజేపీ, ఆరెస్సెస్‌లు దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నాయని బుధవారం రాజ్యసభలో విపక్షాలు ధ్వజమెత్తాయి. 2017లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలున్నందున మతప్రాతిపదికన చీలికతెచ్చి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్, బీఎస్పీ, జేడీయూ విమర్శించాయి. రామమందిర నిర్మాణ సన్నాహాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయన్నాయి. మందిర నిర్మాణం ఇప్పుడే జరగాలని మోదీ సంకేతాలిచ్చినట్లు మహంత్ నృత్యగోపాల్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించి, సభను అడ్డుకున్నాయి. అయితే.. మందిర విషయంలో కేంద్రం, బీజేపీ కట్టుబడిఉన్నాయని.. మంత్రి నఖ్వీ వివరించారు. అయినా విపక్షాలు ఆందోళన విరమించలేదు. ఇదిలా ఉండగా.. మందిర నిర్మాణానికి మోదీ ఆలోచనతో సంబంధం లేదని.. ధర్మాచార్యులు, ప్రజల సాయంతో మందిరాన్ని నిర్మిస్తామని వీహెచ్‌పీ తెలిపింది.
శీతాకాల సమావేశాలు నవంబర్ 26 నుంచి ఈ నెల 23 వరకు సాగాయి. లోక్‌సభ 117గంటల 14 నిమిషాలు కొనసాగగా, రాజ్యసభ 60 గంటలకుపైగా కొనసాగింది. గొడవలు, వాయిదాలతో లోక్‌సభలో 8 గంటల 37 నిమిషాలకాలం, రాజ్యసభలో 47 గంటల సమయం వృథా అయింది. వాయిదాల తర్వాత ఆలస్యంగా మొదలవడంతో లోక్‌సభలో 17గంటల 10 నిమిషాలు, రాజ్యసభలో ఐదు గంటలుపైగా సమయం వృథా అయ్యింది. లోక్‌సభలో 9 ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టారు. 13 బిల్లులు ఆమోదం పొందాయి. 117 ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. రాజ్యసభలో కేవలం ఒక ప్రభుత్వ బిల్లును ప్రవేశపెట్టారు. మూడు బిల్లులను ఉపసంహరించారు. ఆమోదం పొందిన, తిరస్కరణకు గురైన మొత్తం బిల్లులు తొమ్మిది ఉన్నాయి. రెండు బిల్లులను సంయుక్త కమిటీ, సెలక్ట్ కమిటీల పరిశీలనకు పంపించారు.