
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 13 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉభయ సభలు ప్రారంభమయిన తొలుత ఇటీవల మరణించిన పలువురు ప్రముఖులకు సభ్యులు నివాళి అర్పించారు. మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ రాంజెఠ్మలానీ, గరుదాస్ దాస్‌గుప్తాలకు ఉభయ సభలు నివాళి అర్పించాయి. అనంతరం నూతనంగా ఎన్నికయిన సభ్యుల చేత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రశ్నోత్తరాల సమయంలో మహారాష్ట్ర రైతుల సమస్యలపై చర్చించాలని శివసేన ఎంపీలు డిమాండ్ చేశారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు సభ్యులు పలు అంశాలను సభలో లేవనెత్తారు. ప్రస్తుతం లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మరోవైపు కశ్మీర్‌లో నిర్బంధంలో ఉన్న నేతలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్‌తో పాటు యూపీఏ పక్షాల ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా వారందరని నిర్బంధించారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే రెండోదఫా సమావేశాలివి. కాగా 1952లో రాజ్యసభ ప్రారంభ మైన తర్వాత జరగనున్న 250వ భేటీని పురస్కరించుకుని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ భేటీలో ప్రభుత్వం 35 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వీటిల్లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుతోపాటు అక్రమ వలసదారుల నిర్వచనంపై స్పష్టతనిచ్చే వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు కూడా ఉంది. ఈనెల 18వ తేదీన మొదలై డిసెంబర్ 13వ తేదీతో ముగిసే ఈ సమావేశాల్లో పార్లమెంట్ 20 సార్లు భేటీ కానుంది. పార్లమెంట్ వద్ద 43 బిల్లులు పెండింగ్‌లో ఉండగా ఈ సమావేశాల్లో ప్రభుత్వం 27 బిల్లులను ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదం పొందేందుకు సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment