చేతులు జోడించి వేడుకుంటున్నా..
న్యూఢిల్లీ : ఆప్ ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న రైతు గజేందర్ సింగ్ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు గురువారం లోక్సభలో రెండు చేతులు జోడించి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. రైతు ఆత్మహత్యపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో ప్రకటన చేస్తారని, దయచేసి సభా కార్యక్రమాలను సజావుగా సాగనివ్వాలంటూ వెంకయ్య ముకుళిత హస్తాలతో వేడుకున్నారు.
కాగా ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్యపై ఇవాళ పార్లమెంటులో దుమారం రేగింది. దీనిపై కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే రైతు ఆత్మహత్యఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ నాయకులు బాధ్యత వహించాలంటూ విమర్శించారు. దీనిపై ప్రశ్నోత్తరాల సమాయంలో చర్చ జరగాల్సిందని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం ఇస్తామని సభలో ఉన్న హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించినా సభ్యులు ఆందోళన విరమించలేదు. చివరికి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తూ, మధ్యాహ్నం 12 గంటల తర్వాత చర్చకు అనుమతి యిస్తామని స్పీకర్ మహాజన్ ప్రకటించిన తరువాత వివాదం సద్దుమణగలేదు.