ఆఖరి 4 రోజులైనా సాగనివ్వండి
సభను అడ్డుకోబోమని చెబితే.. సస్పెన్షన్ ఎత్తివేతకు సిద్ధమే: వెంకయ్య
న్యూఢిల్లీ: లలిత్ మోదీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సభలో వివరణ ఇచ్చారు కాబట్టి... కాంగ్రెస్ దెబ్బకు దెబ్బ అనే వైఖరిని విడనాడి ఆఖరి నాలుగు రోజులైనా పార్లమెంటును సజావుగా సాగనివ్వాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. 25 మంది కాంగ్రెస్ ఎంపీలను ఐదురోజుల పాటు సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమనే విపక్షాల వాదనను తిప్పికొడుతూ... సస్పెన్షన్ ఎత్తివేతకు తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నామని, కాంగ్రెస్ మాత్రం సభలోకి రావడానికి ఇష్టపడటం లేదన్నారు.
సస్పెన్షన్‌ను ప్రజాస్వామ్యానికి బ్లాక్‌డేగా సోనియా అభివర్ణించడంపై స్పందిస్తూ... ‘ఈ వర్షాకాల సమావేశాల్లో అసలు మంచిరోజులు ఉన్నాయా? దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించొద్దు. ఇప్పటికైనా సోనియా గాంధీ, కాంగ్రెస్ ఆత్మావలోకనం చేసుకోవాలి. మిగిలిన నాలుగు రోజుల సమావేశాలనైనా సజావుగా సాగనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు.
లోక్‌సభలో మూడింట రెండోంతుల మెజారిటీ ఉన్న అధికార కూటమిని ముఖ్యమైన బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందనీయకుండా అడ్డుకుంటున్నారని విపక్షంపై మండిపడ్డారు. మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాంగ్రెస్‌కు ఆనందదాయకమని, కాంగ్రెస్ వైఖరి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. జులై 21న మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 13తో ముగియనున్నాయి.