షాక్.. గాంధీ లేకుండా కొత్తనోట్లు
భోపాల్: దొంగనోట్లు ముద్రించే వాళ్లు తప్పు చేశారంటే నమ్మొచ్చు.. కానీ, ఆర్బీఐ కూడా తప్పు చేసిందంటే నమ్మగలమా.. కానీ, ఒక్కసారి కూడా నమ్మక తప్పదేమో. ఎందుకంటే.. మహాత్మాగాంధీ బొమ్మ లేకుండా కొత్త రెండు వేల రూపాయల నోట్లు ముద్రించారు. అవును ఈ నోట్లు కూడా బ్యాంకుకు రావడం.. అక్కడి నుంచి రైతులకు వెళ్లడం తిరిగి రైతుల నుంచి బ్యాంకు రావడం కూడా జరిగిపోయింది.
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని ఓ ఏజెన్సీ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లి రూ.2000 నోట్లు తీసుకున్నారు. అయితే, తొలుత కొత్త నోట్లేగా చూసుకోవాల్సిన పనేముందనుకొని ఇంటికెళ్లారు. అనంతరం చూసుకోగా వాటిపై గాంధీ బొమ్మ కనిపించలేదు. దీంతో అవి దొంగనోట్లు అనుకొని తిరిగి బ్యాంకు వద్దకు తీసుకురాగా వాటిని తనిఖీ చేసిన అధికారులు అవి దొంగనోట్లు కాదని, ఆర్‌బీఐ నోట్లేనని, వాటిని తీసుకొని తిరిగి వారికి వేరే నోట్లు ఇచ్చారు. ముద్రణ లోపం కారణంగా తప్పు జరిగి ఉంటుందని వారు వివరించారు.