గంజాం : మనలాంటి మనిషే అయినా కేవలం 20 కాలివేళ్లు, చేతులకి 12 వేళ్లతో జన్మించినందుకు 63 ఏళ్ల వృద్ధురాలిని నాలుగు గోడలకే పరిమితం చేసిన ఘటన ఒడిశాలోని గంజాంలో వెలుగు చూసింది. గంజాం జిల్లా కదపడ గ్రామంలో 63 ఏళ్ల మహిళ నయక్ కుమారి తాను చేయని పాపానికి వివక్షకు గురైంది. తనను మంత్రగత్తె ముద్ర వేసి ఇరుగు పొరుగు వారు తనను ఇల్లు కదలనీయడం లేదని ఆమె వాపోయింది. తాను పుట్టుక లోపంతోనే ఇలా ఉన్నానని, పేదరికం కారణంగా చికిత్స చేయించుకోలేదని తనను మంత్రగత్తెగా స్ధానికులు భావిస్తూ దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది.
మరోవైపు తమది చిన్నగ్రామమని, ఇక్కడి ప్రజల్లో మూఢనమ్మకాలు పేరుకుపోయాయని, దీంతో ఆమెను మంత్రగత్తెగా అందరూ భావిస్తున్నారని కుమారి దీనగాధను అర్ధం చేసుకున్న మరో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఒకటి రెండు వేళ్లు అధికంగా ఉండటం అసాధారణమేమీ కాదని సర్జన్ డాక్టర్ పినాకి మహంతి చెప్పారు. అయితే 20 కాలి వేళ్లు, 12 వేళ్లు ఉండటం అరుదని, జన్యుపరంగా ఇలాంటివి జరగవచ్చని, ప్రతి ఐదు వేల మందిలో ఒకరిద్దరికి ఇలా జరుగుతుందని తెలిపారు. వైద్య పరమైన విషయంలో సామాజిక వివక్ష తగదని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment