
పుణె: దేశ వైద్య చరిత్రలో మరో అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. ఆసియాలోనే తొలిసారిగా గర్భసంచి మార్పిడి అనంతరం ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన చికిత్స పుణేలోని గెలాక్సీ కేర్ ఆస్పత్రిలో జరిగింది. అది కూడా తల్లి ఏ గర్భసంచి నుంచి జన్మించిందో.. బిడ్డ కూడా అదే గర్భసంచి నుంచి జన్మించడం ఇక్కడ విశేషం. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన మీనాక్షికి గర్భసంచి లేకపోవడం వల్ల ఆమె పిల్లల్ని కనలేకపోయారు. దీంతో తల్లి కావాలనే ఆమె కోరిక తీరాలంటే.. గర్భసంచి తప్పనిసరి అయింది. ఈ సమయంలో ఆమె తల్లి గర్భసంచి దానానికి ముందుకు వచ్చారు.
దీంతో మీనాక్షి తల్లి కావడానికి మార్గం సుగమమైంది. తొమ్మిది గంటలపాటు అరుదైన శస్త్ర చికిత్స చేసిన పుణెలోని గెలాక్సీ కేర్ ఆస్పత్రి వైద్యులు మీనాక్షి తల్లి గర్భసంచిని ఆమెకు అమర్చారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు మీనాక్షిని వైద్యులు తమ పర్యవేక్షణలో ఉంచి వైద్యం అందించారు. మీనాక్షి పరిస్థితి మెరుగుపడ్డాక ఆమెను గుజరాత్‌కు పంపించారు. ఈ ఏడాది మార్చిలో గర్భం దాల్చిన తర్వాత మీనాక్షి తిరిగి గెలాక్సీ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ వైద్యులు ఆమెకు తగిన చికిత్స అందజేశారు. ఆ తర్వాత 32 వారాల 5 రోజులకు ఆమె సీజేరియన్ ద్వారా పాపకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఈ అరుదైన చికిత్సలో పాలుపంచుకున్న డాక్టర్ శైలేష్ పుంటంబేకర్ నేతృత్వంలోని వైద్య బృందం దీనిపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చికిత్స విజయంతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని.. ఈ శస్త్ర చికిత్స దేశ వైద్య చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment