కన్నకూతురికి 'అమ్మ'దనమే బహుమతి!
తల్లి కావడం ఆడవాళ్లకు దేవుడిచ్చిన వరం. కానీ అసలు గర్భసంచి అన్నదే లేకుండా పుట్టిన ఓ యువతికి కూడా బిడ్డలను కనాలని చాలా బలమైన కోరిక ఉంది. దాన్ని తీర్చడానికి స్వయంగా ఆమె తల్లే కదిలొచ్చింది. 21 ఏళ్ల వయసున్న కూతురికి తన గర్భసంచిని దానం చేసేందుకు 43 ఏళ్ల తల్లి అంగీకరించింది. తద్వారా ఆమె కూడా తనలాగే తల్లి కావడానికి మార్గం సుగమం చేసింది. ఇలా ఇద్దరూ సరేననడంతో భారతదేశ వైద్య చరిత్రలోనే ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని పుణెలో దేశంలోనే మొట్టమొదటి సారిగా గర్భసంచి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇప్పటివరకు చాలాసార్లు గుండెలను కూడా మార్చిన వైద్యులు.. గర్భసంచిని మార్చడం మాత్రం ఇదే తొలిసారి. పుణెలోని గెలాక్సీ కేర్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శైలేష్ పుంటంబేకర్ నేతృత్వంలోని బృందం ఈ శస్త్రచికిత్స చేసింది. ఈ ఆపరేషన్‌కు మొత్తం తొమ్మిదిన్నర గంటలు పట్టిందని డాక్టర్ శైలేష్ చెప్పారు. గర్భసంచికి చాలా పెద్ద సంఖ్యలో పెద్ద రక్తనాళాలు కలిసి ఉంటాయని, అలాగే చిన్న చిన్న నరాలు కూడా ఉంటాయని, వాటన్నింటినీ కొత్తగా గర్భసంచికి కలపడం సాంకేతికంగా చాలా కష్టమని ఆయన వివరించారు. శస్త్రచికిత్స పూర్తయినా.. కొత్త గర్భసంచి శరీరానికి అలవాటు పడేందుకు ఒక ఏడాది పాటు వేచి చూడాలని, ఆ తర్వాతే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చేందుకు ప్రయత్నం చేయాలని తెలిపారు.
ఇంతకుముందు ఎక్కడ..
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్వీడన్లో ఈ తరహా శస్త్రచికిత్స జరిగింది. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్‌లో గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మాట్స్ బ్రాన్‌స్ట్రామ్ నేతృత్వంలో ఈ చికిత్సలు చేశారు. ఇలాంటి చికిత్సల ద్వారా ఇప్పటివరకు కేవలం ఆరుగురు పిల్లలే పుట్టారు. వారిలో ఇద్దరు ఒకే తల్లికి పుట్టినవారు. నిజానికి ఈ బృందం మొదట చేసిన 11 శస్త్రచికిత్సలు విఫలమయ్యాయి. ఆ తర్వాత 2014లో చేసిన మార్పిడి విజయవంతం అయ్యింది. ఆరోగ్యవంతమైన శిశువు పుట్టింది. స్వీడిష్ బృందం చేసిన శస్త్రచికిత్సల ద్వారానే మిగిలిన ఐదుగురు పిల్లలు కూడా పుట్టారు.
పిల్లలు పుడతారా?
దేశంలో తొలిసారి జరిగిన గర్భసంచి మార్పిడి ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందన్నది మాత్రం అనుమానంగానే కనిపిస్తోంది. తల్లి కావాలన్న ఆ మహిళ కలలను నిజం చేయడం తమ బాధ్యత అని, దాన్ని నెరవేర్చడానికి తమ శాయశక్తులా కృషి చేశామని డాక్టర్ శైలేష్ చెప్పారు. దేశంలో మొట్టమొదటి సారిగా చేసిన ఈ శస్త్రచికిత్స ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సి ఉందన్నారు. ఈ ప్రొసీజర్ చాలా సంక్లిష్టమైనది కావడంతో ఇవి ఎంతవరకు విజయవంతం అవుతాయన్నది అనుమానమే. భారతదేశంలో ఇది మొట్టమొదటి ప్రయత్నం కాగా, ప్రపంచంలోనే 30వది. ఇప్పటివరకు అమెరికా, బ్రెజిల్, స్వీడన్, చైనా, జర్మనీ, సెర్బియా, చెక్ రిపబ్లిక్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి గానీ ఒక్క స్వీడన్లోనే ఇంతవరకు విజయవంతం అయ్యాయి.