మృతురాలు షకీనా అష్ఫాక్
బరేలీ (ఉత్తరప్రదేశ్): చూడటానికి బక్కపలుచగా, బొక్కలు కనిపించేలా ఉండే 50 ఏళ్ల షకీనా అష్ఫక్ మంగళవారం తన ఇంట్లో ప్రాణాలు విడించింది. ఐదురోజులుగా ఏమీ తినకపోవడంతో ఆమె ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఇంటిపెద్ద కావడంతో షకీనా పేరిట రేషన్ కార్డు ఉంది. కానీ, పక్షవాతంతో మంచం పట్టిన షకీనా వేలిముద్రలు ఇవ్వడానికి ఈ నెల రేషన్ షాప్‌కు వెళ్లలేకపోయింది. దీంతో ఈ నెల కోటా చౌకబియ్యం ఆమె కుటుంబానికి ఇవ్వడానికి రేషన్ దుకాణం నిరాకరించింది. దీంతో అన్నం లేక.. ఆకలితో అలమటించి షకీనా ప్రాణాలు విడించిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. బరేలీలో జరిగిన ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆకలితో కాదు అనారోగ్యంతోనే షకీనా చనిపోయిందని యోగి సర్కారు ఇంతకుముందు వాదించింది.
ఆమె కుటుంబసభ్యులు మాత్రం నవంబర్ నెలకు తమకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం ఇవ్వలేదని, షకీనా ఇంటిపెద్ద కావడంతో ఆమె పేరిట రేషన్ కార్డు ఉందని, అనారోగ్యంతో ఉన్న ఆమెను రిక్షాలో సైతం రేషన్ దుకాణం తీసుకెళ్లడానికి కుదరలేదని, ఈ విషయాన్ని రేషన్ దుకాణంలో వివరించి ఈ నెల చౌకబియ్యం ఇవ్వాల్సిందిగా వేడుకున్నామని, అయినా, బయోమెట్రిక్ లేనిదే చౌకబియ్యం ఇవ్వడం కుదరదని రేషన్ డీలర్ తెలిపాడని షకీనా భర్త మహమ్మద్ ఇషాక్ తెలిపారు. షకీనా అనారోగ్యంతో ఉన్న విషయం వాస్తవమేనని, కానీ, ఆహారం లేక ఆమె ఆకలితోనే ప్రాణాలు విడిచిందని ఆయన తెలిపారు. అయితే, ప్రభుత్వ అధికారులు మాత్రం ఆధార్ లేకపోతే.. రేషన్ ఇవ్వకూడదన్న ఆదేశాలు ఏమీ లేవని, ఈ షకీనా కుటుంబానికి రేషన్ అందకపోవడం, ఆమె మరణంపై విచారణ జరుపుతున్నామని తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment