ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నవారి పట్ల కూడా కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో కరోనాను జయించిన ఒక వైద్యురాలిపై ఆమె పక్కింటి వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె ఇంట్లో ఉండగానే బయటి నుంచి తాళం వేశాడు. ఆ వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. వివరాల్లోని వెళితే.. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సదరు వైద్యురాలు ఓ హాస్పిటల్‌లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఆమెకు కరోనా సోకడంతో వైఎంసీఏ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించారు. (చదవండి : కరోనా ఉందని ఆస్పత్రిలో చేర్పిస్తే.. శ్మశానానికి పంపారు)
చికిత్స అనంతరం రెండు వరుస టెస్టుల్లో కరోనా నెగిటివ్‌గా తేలడంతో వైద్యులు బుధవారం ఆమెను డిశ్చార్జి చేశారు. దీంతో ఆమె తన నివాసానికి చేరుకున్నారు. అయితే వైద్యురాలు ఇంటికి చేరుకున్న సమయంలో ఆ అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తి ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో భయపడిపోయిన ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ‘నేను కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు చెప్పినా.. ఆ వ్యక్తి వినిపించుకోలేదు. నాతో అసభ్యకరంగా మాట్లాడటంతో పాటుగా.. నేను అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండటానికి వీలు లేదంటూ బెదిరింపులకు దిగాడు. నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో అపార్ట్‌మెంట్ అధ్యక్షుడితో మాట్లాడుకోవాలని చెప్పి.. నేను నా ఫ్లాట్ లోపలికి వెళ్లిపోయాను. అయితే నేను లోపలికి వెళ్లగానే అతను బయటి నుంచి తాళం వేశాడు. నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోవాలని నాపై బెదిరింపులకు దిగాడు.
దీంతో నేను భయంతో పోలీసులకు, నా ఆస్పత్రి సిబ్బందికి ఫోన్ చేశాను. ప్రస్తుతం నేను నా ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నాను. ఈ ఘటన జరిగిన తర్వాత నాకు చాలా భయం వేస్తుంది. నా భద్రత గురించి ఆందోళనగా ఉంది’ అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వైద్యురాలి ఫిర్యాదుపై లోతైన దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, పలు చోట్ల కరోనా విధులు నిర్వరిస్తున్న వైద్యుల పట్ల కూడా కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి : చైనాకు అక్రమంగా మాస్కులు, పీపీఈ కిట్లు)
Comments
Please login to add a commentAdd a comment