
చివరి క్షణంలో పెళ్లికి నిరాకరించింది
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో ఓ వధువు చివరి నిమిషంలో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. వరుడి మానసిక పరిస్థితి నిలకడగా లేదన్న విషయం తెలియడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పెళ్లిపీటల మీదే వివాహం ఆగిపోయింది. కాన్పూర్లో ఆదివారం ఈ ఘటన జరిగింది.
పీజీ చదివిన వధువుకు ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఇందుకు తగిన ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి రోజున వరుడి ప్రవర్తన సాధారణంగా లేదని గ్రహించిన వధువు స్నేహితులు ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశారు. వధువు కూడా వరుడి పరిస్థితిని గమనించి, అతని మానసిక పరిస్థితి సరిగాలేదని నిర్ధారణకు వచ్చింది. దీంతో అతణ్ని వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా అంగీకరించలేదు. వరుడి బంధువులు గొడవకు దిగడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.