కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం
దేశ రాజధాని నగరంలో మరోసారి దారుణం జరిగింది. ఓ యువతిని నలుగురు వ్యక్తులు మాల్ బయట నుంచి అపహరించి, ఆమెను కారులో తీసుకెళ్లి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం చేసి.. తర్వాత రోడ్డుమీద విసిరేసి పోయారు. ఈ దారుణం ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్‌లో జరిగింది. మాల్లో పనిచేస్తున్న ఆ యువతి (22) తనపై అత్యాచారం చేసిన నలుగురి పేర్లను పోలీసులకు తెలిపింది. వారిలో ఒకరు ఆమె బోయ్‌ఫ్రెండు కావడం గమనార్హం. నిందితులతో ఒకరు మైనర్ అని పోలీసులు చెప్పారు.
సామూహిక అత్యాచారం చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆమెను నోయిడాలోని ఓ ఆస్పత్రి సమీపంలో రోడ్డుమీద విసిరేసి పోయారు. ఈ నలుగురిపైన ఆమె గతంలో కూడా తమకు ఫిర్యాదు చేసిందని, కేసును తాము దర్యాప్తు చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ సీనియర్ పోలీసు అధికారి అతుల్ యాదవ్ తెలిపారు. అప్పుడే తనకు రక్షణ కావాలని కోరినా ఆమెను పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి స్నేహితులు ఆరోపించారు.