హత్యాకాండ! | Woman hacked to death at Nungambakkam railway station | Sakshi
Sakshi News home page

హత్యాకాండ!

Published Sat, Jun 25 2016 2:23 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

హత్యాకాండ! - Sakshi

హత్యాకాండ!

మానవత్వం మంటగలిసి పోతోందనేందుకు రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు సాక్షి భూతంగా నిలిచాయి. కన్నతల్లి, కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలు అనే విచక్షణ లేకుండా ప్రాణాలు తీస్తూ మనిషి రాక్షసుడిగా మారిపోతున్నాడు. శుక్రవారం నాటి దుర్ఘటనలతో రక్తాక్షరాలతో లిఖించదగిన రాష్ట్రంగా మారింది. మృతులంతా మహిళలే కావడం మరింత విషాదకరంగా మారింది.
     
హత్యలతో అట్టుడికిన రాష్ట్రం
మృతుల్లో ఆరుగురు మహిళలు
తాళం వేసిన ఇంట్లో మృతదేహాలు
భార్య, ముగ్గురు కుమార్తెల హతం
మహిళా ఇంజనీర్ హత్య
తల్లిని కడతేర్చిన తనయుడు

సాక్షి ప్రతినిధి, చెన్నై:  ఓ కిరాతకుడు సహజీవనం సాగిస్తున్న మహిళను, ఆమె ముగ్గురు కుమార్తెలను హతమార్చి తనలోని రాక్షసత్వాన్ని బైటపెట్టుకున్నాడు. చెన్నై రాయపేట పాత పోలీస్ స్టేషన్ వెనుకవైపున ఉన్న ఒక అపార్టుమెంటులో చిన్నరాజ్ (42) కాపురం ఉంటున్నాడు. స్వీట్‌షాపులో మాస్టర్‌గా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

సదరు చిన్నరాజ్ 2012 నుంచి పాండియమ్మాల్ (38) అనే మహిళతో సహజీవనం చేస్తూ సమాజంలో భార్యభర్తలుగా చలామణి అవుతున్నారు. వీరికి పవిత్ర (19), పరిమళ (18) స్నేహ (16) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో పరిమళ పనిమలర్ పాలిటెక్నిక్‌లోను, మూడో కుమార్తె స్నేహ ప్లస్‌టూ చదువుతూ వచ్చారు. రెండో కుమార్తె పరిమళ పారామెడికల్ కోర్సులో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని వారాల క్రితం చిన్నరాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన సొంతూరైన కారక్కుడికి వెళ్లి ఈనెల 20వ తేదీనే చెన్నైకి వచ్చారు.

ఆ రోజు నుండి ఇల్లు తాళం వేసిన స్థితిలోనే ఉండింది. అప్పుడప్పుడూ చిన్నరాజ్ వస్తూ పోతుండగా, భార్యా పిల్లలు ఎక్కడని ఇరుగు పొరుగు ప్రశ్నించగా, వారంతా ఊర్లో ఉన్నారని చెప్పుకుంటూ వచ్చాడు. రూమ్ స్ప్రే తీసుకుని వెళుతున్న చిన్నరాజ్‌ను మీ ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని మళ్లీ ప్రశ్నించడంతో ఎలుకలు చనిపోయాయి, అందుకే స్ప్రే చేస్తున్నానని బుకాయించాడు.  ఈ దశలో తాళం వేసి ఉన్న వారింట్లో నుంచి దుర్వాసనలు మరింత పెరిగిపోవడంతో ఇంటి యజమాని రాజాబహదూర్ (73) రాయపేట పోలీసు స్టేషన్‌లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు.

దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నరాజ్ ఇంటి తాళం పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా పాండియమ్మాల్, ఆమె ముగ్గురు కుమార్తెల మృతదేహాలు కుళ్లిన స్థితిలో పడిఉన్నాయి. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వాసుపత్రికి పంపారు. దీనికి సంబంధించి రాయపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ప్రాథమిక విచారణలో నలుగురు మహిళలను చిన్నరాజ్ హత్యచేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అడిషనల్ పోలీసు కమిషనర్ (సౌత్) కె. శంకర్ నేతృత్వంలోని జాయింట్ కమిషనర్ ఎస్ మనోహరన్, రాయపేట పోలీసు ఇన్‌స్పెక్టర్ గోపాలగురు ఆధ్వర్యంలోని పోలీసుల బృందం శుక్రవారం ఉదయం చెన్నై మెరీనా బీచ్‌లోవున్న చిన్నరాజ్‌ను అరెస్టు చేసింది.
 
మనస్పర్థలతోనే హత్యలు: భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగానే అందరినీ హతమార్చినట్లు నిందితుడు చిన్నరాజ్ అంగీకరించాడు. కృష్ణగిరి జిల్లా బర్గూర్‌కు చెందిన తాను 2012లో దిండుగల్ జిల్లా, పళనిలో ఒక స్వీట్‌షాపులో పనిచేస్తుండగా శివగంగై జిల్లా, తిరుపత్తూరు తాలూకా, కట్టయంపట్టికి చెందిన పాండియమ్మాల్‌తో పరిచయం ఏర్పడిందని తెలిపాడు. ఆమెకు అంతకు ముందే వివాహమై ముగ్గురు కుమార్తెలతో విడిగా జీవిస్తూ వచ్చినట్లు తెలిపాడు.

తర్వాత ఆమెను వివాహం చేసుకుని ముగ్గురి కుమార్తెలతో చెన్నై చేరుకున్నట్లు తెలిపాడు. గత కొంతకాలంగా పాండియమ్మాల్, తనకు మధ్య తరచుగా గొడవలు ఏర్పడేవని, అనేక సార్లు మద్యం తాగి ఇంటి బయటే పడుకునేవాడిన ని తెలిపాడు. దీంతో తనపై పాండియమ్మాల్ ఆగ్రహం వ్యక్తం చేసేదని అన్నాడు. హత్యలు చేసిన రోజైన ఈనెల 20వ తేదీన సైతం తమ మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత తాను పనికి వెళ్లినట్లు తెలిపాడు.

రాత్రి మద్యం తాగి వచ్చిన తనను పాండియమ్మాల్ లోనికి అనుమతించలేదని, దీంతో తెల్లవారుజాము మూడు గంటల సమయంలో పాండియమ్మాల్‌ను ఇనుపరాడ్‌తో మోది హత్య చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత బెడ్‌రూంలో నిద్రిస్తున్న పవిత్ర, పరిమళపై అదే ఇనుపరాడ్ తో దాడి చేసి చంపానని అన్నాడు. మూడవ కుమార్తె స్నేహను ఇస్త్రీపెట్టె వైరుతో గొంతు నులిమి హత్య చేసి పరారైనట్లు తెలిపాడు. పోలీసులు అతని వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు.మహిళా ఇంజనీర్ హత్య: చెన్నై నగరం నుంగంబాక్కం రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం పట్టపగలే చోటుచేసుకున్న హత్యతో నెత్తురోడింది. గుర్తుతెలియని యువకుడి చేతిలో మహిళా యువ ఇంజనీరు స్వాతి (24) దారుణ హత్యకు గురైంది. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో నుంగంబాక్కం లోకల్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారంపై కూర్చుని ఉన్న స్వాతి వద్దకు ఓ యువకుడు రాగా, ఇద్దరు తీవ్రంగా ఘర్షణ పడ్డారు.

యువకుడి మాటలకు విసుగుచెందిన స్వాతి అక్కడి నుండి లేచి వెళ్లిపోతుండగా తన వద్ద దాచుకుని ఉన్న వేట కొడవలితో విచక్షణారహితంగా నరికాడు. ప్లాట్‌ఫారంపై పరిమిత సంఖ్యలో ప్రయాణికులు ఉన్నా యువకుడు కత్తితో సాగిస్తున్న స్వైర విహారంతో భయపడి  దాక్కుకున్నారు. రక్తప్రవాహంలో విలవిల కొట్టుకుంటూ స్వాతి ప్రాణాలు విడిచింది. హత్యకు పాల్పడిన యువకుడు పారిపోయాడు.

చెన్నై చూలైమేడులో తల్లిదండ్రులతో కలిసి నివసించే స్వాతి కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకుని చెంగల్పట్టు పానూరులోని మహేంద్రసిటీ ప్రాంగణంలోని ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో స్వాతి ఉద్యోగం చేస్తోంది. ఏకపక్ష ప్రేమ వ్యవహారమే ఆమె ప్రాణం తీసి ఉంటుందని భావిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
 
తల్లిని బావిలోకి తోసి..: కన్నతల్లిని బావిలోకి తోసి వదిలించుకున్న కిరాతక కుమారుని వివరాలు ఇలా ఉన్నాయి. జేజే నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీవీఎస్ అవెన్యూలో జ్యోతిప్రియ (60) తన కుమారుడు సత్యకుమార్, తన భర్త మొదటి భార్య కుమార్తె ఉషారాణి, ఇద్దరు మనవళ్లతో కలిసి నివసిస్తున్నారు.

ఇంజినీరింగ్ చదివి కెనడాలో ఉద్యోగం చేస్తున్న సత్యకుమార్ మూడేళ్ల క్రితం తిరిగి చెన్నైకి వచ్చి ఖాళీగా ఉన్నాడు. గురువారం అర్ధరాత్రి తన తల్లిని మోసుకువెళ్లి ఇంటి సమీపంలోని పాడుబడిన బావిలో పడవేశాడు. ఆ బావిలో మూడు అడుగుల నీరు మాత్రమే ఉండడంతో తాను కూడా తల్లిపైకి దూకి ఆమె ప్రాణాలు విడిచేవరకు అలానే నిలుచున్నాడు. బావి నుండి వచ్చిన కేకలతో బైటకు వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని పట్టించారు. ఉద్యోగం లేదన్న విరక్తితో తల్లిని హతమార్చినట్లు విచారణలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement