ఆ ఎమ్మెల్యే నన్ను కొరికింది
తిరువంతనపురం: వామపక్ష మహిళా ఎమ్మెల్యే జమీలా ప్రకాశం తనను కొరికారని కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు శివదాసన్ నాయర్ ఆరోపించారు. కేరళ అసెంబ్లీలో ఆర్థికమంత్రి కేఎం మణి శుక్రవారం నాడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ సమయంలోనే సీఎం ఊమెన్ చాందీకి రక్షణగా తాను నిలబడినప్పుడు వామపక్ష ఎమ్మెల్యే జమీలా ప్రకాశం తనను కొరికారని శివదాసన్ ఆరోపించారు.. తన చేతికి అయిన గాయాలను కూడా ఆయన మీడియాకు చూపించారు.
అంతకుముందు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక మంత్రి కేఎం మణి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వీల్లేదంటూ ప్రతిపక్ష ఎల్డీఎఫ్ సభ్యులు నిరసనకు దిగారు. బార్ల లైసెన్సుల విషయంలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ మంత్రి మణి తక్షణం రాజీనామా చేయాలని పట్టుబట్టారు. మార్షల్స్ కు, విపక్ష సభ్యులకు మధ్య తోపులాట రణరంగాన్ని తలపించింది. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ కుర్చీని పోడియం నుంచి తోసేశారు. కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీంతో శాసనసభ లోపల, బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు విపక్షాల నిరసనల మధ్య మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.