TS Adilabad Assembly Constituency: TS Election 2023: ‘మహిళా బిల్లు’తో భవిష్యత్‌లో మారనున్న రాజకీయం!
Sakshi News home page

TS Election 2023: ‘మహిళా బిల్లు’తో భవిష్యత్‌లో మారనున్న రాజకీయం!

Published Thu, Sep 21 2023 1:22 AM | Last Updated on Thu, Sep 21 2023 10:54 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలని 33శాతం సీట్లు రిజర్వు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 128వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంతో రాజకీయంగా మహిళా ప్రాతినిధ్యంపై చర్చ మొదలైంది. ఈ బిల్లు వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాకున్నా.. 2029 ఎన్నికల వరకు అమలయ్యే అవకాశం ఉంది.

ఈ చట్టం కార్యరూపం దాల్చితే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది శాసనసభ స్థానాలు, రెండు లోకసభ స్థానాల్లో మహిళలకు రాజకీయంగా అవకాశాలు మెరుగుపడనున్నాయి. గత 70ఏళ్ల ఎన్నికల గణాంకాలు పరిశీలిస్తే.. ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లో ఒక్కో స్థానం నుంచి 15మంది చొప్పున దాదాపు 150పైగా మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

కానీ వీరిలో ఆరుగురు మహిళలకు మాత్రమే చట్ట సభల్లోకి వెళ్లే అదృష్టం దక్కింది. పది స్థానాల్లో ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల నుంచే ఆరుగురు ఎమ్మెల్యేలుగా ఉండడం గమనార్హం. ఇక ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న పెద్దపల్లి, ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాలకు 36మంది ఎంపీలుగా ఎన్నిక కాగా, ఇందులో పెద్దపల్లి నుంచి సుగుణకుమారి 1998లో 12వ లోక్‌సభకు ఒక్కసారి ఎన్నికయ్యారు.

ఆసిఫాబాద్‌ నుంచే ఆరంభం!
ఉమ్మడి జిల్లా నుంచి తొలిసారిగా ఓ మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికైంది ఆసిఫాబాద్‌ నుంచే. 1999లో ఉమ్మడి ఆసిఫాబాద్‌ నియోజకవర్గ పరిధిలో తాండూరు జెడ్పీటీసీగా ఉన్న భర్త, వెంకటక్రిష్ణయ్య ప్రోత్సాహంతో వైద్యురాలైన పాటి సుభద్ర తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004లో అమురాజుల శ్రీదేవి టీడీపీ నుంచే గెలుపొందారు.

టీఆర్‌ఎస్‌ నుంచి 2014లో కోవ లక్ష్మి ఎన్నికయ్యారు. ఈ ఒక్క స్థానం నుంచే ముగ్గురు మహిళలు శాసనసభ్యులుగా గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బెల్లంపల్లి ఏర్పడ్డాక, 2009లో ప్రజారాజ్యం నుంచి అమురాజుల శ్రీదేవి, 2014లో తెలుగుదేశం నంచి పాటి సుభద్ర పోటీ చేసి ఓడిపోయారు.

సిర్పూర్‌ నుంచి పాల్వాయి రాజ్యలక్ష్మి
1999 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికలకు మూడు రోజుల ముందు నక్సలైట్ల చేతిలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు ప్రాణాలు కోల్పోయారు. ఆ స్థానంలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మికి టీడీపీ టికెట్‌ ఇచ్చింది. అలా అనూహ్యంగా ఆ స్థానం మహిళకు దక్కింది. 2004లో మళ్లీ పోటీ చేయగా రెండో స్థానంలో నిలిచారు.
పాల్వాయి రాజ్యలక్ష్మి

ఖానాపూర్‌ నుంచి ఇద్దరు..
2008లో తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి సుమన్‌ రాథోడ్‌ గెలుపొందారు. ఆ తర్వాత 2009లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆమె సామాజికవర్గంపై వివాదం రావడం, కోర్టు కేసులతో రాజకీయంగా ఇబ్బంది ఎదురైంది. ఈ మహిళ స్థానాన్ని మళ్లీ 2014, 2018లో రేఖానాయక్‌ భర్తీ చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి ఏౖకైక మహిళా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

సగం ఓట్లు వారివే.. అవకాశాలే తక్కువ..
1952 నుంచి 2018మధ్య 15సార్లు ఒక్కో నియోజకవర్గం నుంచి 15మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కొన్ని చోట్ల ఉప ఎన్నికలు కూడా వచ్చాయి. అయితే ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, సిర్పూర్‌ మినహా ఎక్కడా మహిళలకు అవకాశాలు రాలేదు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ముథోల్‌, బోథ్‌, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నుంచి మహిళానాయకులు ఒక్కరు కూడా ఎన్నికై చట్టసభల్లో కాలు మోపలేదు.

చివరగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గండ్రాత్‌ సుజాత, ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవ లక్ష్మి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొన్ని చోట్ల స్వతంత్రంగా పోటీ చేస్తున్నప్పటికీ రాజకీయ పార్టీలు సైతం మిగతా చోట్ల టికెట్లు ఇచ్చి ప్రోత్సహించలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పురుషులతో సమానంగా మహిళలు జనాభా, ఓటర్లలో ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులుగా మాత్రం ఎన్నికయ్యే అవకాశం రాలేదు.

భవిష్యత్‌లో మార్పులు తప్పవు..
మహిళా బిల్లుతో భవిష్యత్‌లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో మార్పులు అనివార్యం కానున్నాయి. మహిళా కోటా అమలు చేస్తే ఇప్పుడున్న పది స్థానాల్లో కనీసం రెండు నుంచి మూడు స్థానాల వరకు మహిళలకే రిజర్వు కానున్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ స్థానాలు పోను, ఒక జనరల్‌ స్థానం ఉండనుంది. రొటేషన్‌ పద్ధతిలో ఉమ్మడి జిల్లా నుంచి ప్రతీ పదేళ్లకోసారి జరిగే డీ లిమిటేషన్‌ కమిటీ ప్రతిపాదనలతో మార్పులు చేర్పులు జరగనున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని మహిళా నాయకులకు అవకాశాలు మెరుగుపడనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement