సాక్షి, కుమురం భీం: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జి ల్లాలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. అధికార పార్టీ, ప్రధాన విపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి. విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్న అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతలు.. తమ సమీప అభ్యర్థులపై ఆధిపత్యం చెలాయించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. అత్యవసరమైతే తమ అమ్ముల పొదిలో ఉన్న ‘పవర్’ను చివరి అస్త్రంగా ఉపయోగించేందుకు సైతం వెనుకాడడం లేదని తెలుస్తోంది. ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలే అందుకు కారణమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఆసిఫాబాద్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును కాదని, జెడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్షి్మకి టికెట్ కేటాయించింది.
సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీల్లో అభ్యర్థులెవరన్నది నేటికీ తేలలేదు. సిర్పూర్‌లో బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మొదటి విడత జాబితాలోనే టికెట్ ఖాయం చేసింది. దీంతో అక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కోరళ్ల కృష్ణారెడ్డి, రావి శ్రీనివాస్ టికెట్‌ను ఆశిస్తుండగా.. బీజేపీ నుంచి డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబుతోపాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ సైతం పోటీ పడుతున్నారు.
ఇక ఆసిఫాబాద్ విషయానికొస్తే కాంగ్రెస్ నుంచి డాక్టర్ గణేష్ రాథోడ్, శ్యాంనాయక్, మర్సుకోల సరస్వతి టికెట్ కోసం ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. అధికార పార్టీ అభ్యర్థులు మాత్రం తమకు గట్టి పోటీ ఇస్తారనుకునే ప్రతిపక్ష పార్టీల నేతలపై ఓ కన్నెసి ఉంచినట్లు సమాచారం. వారు ఏ చిన్న తప్పు చేసినా దానిని భూతద్దంలో చూపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కన్నెర్రజేస్తే.. కేసు పెట్టాల్సిందే!
రానున్నది ఎన్నికల సమయం. చేతిలో అధికారం ఉండనే ఉంది. అధికారపార్టీ నేతలు చెప్పినట్లుగా అధికారులు నడుచుకోవాలి్సందే. లేదంటే బదిలీ బహుమతి ఖాయం. ఈ నేపథ్యంలో అడకత్తెరలో చిక్కిన వక్క మాదిరిగా తయారైంది జిల్లా అధికారుల తీరు. ముఖ్యంగా పోలీసు అధికారుల కష్టాలు వర్ణనాతీతమనే చెప్పాలి. ఆసిఫాబాద్‌లో పది రోజుల కిందట ఓ కుల సంఘం సభ్యులంతా సమావేశం నిర్వహించుకున్నారు.
ఈ సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడి పనితీరుపై సభ్యులు ప్రశ్నించినట్లు సమాచారం. ఇక అంతే ఆ సంఘం అధ్యక్షుడు అధికార పార్టీ నేతకు సంఘ సభ్యులపై ఫిర్యాదు చేయడమే తరువాయి.. పదిహేను మందిపై పోలీసు కేసు నమోదైంది. సంఘ అధ్యక్షుడిపై దాడికి యత్నించినట్లుగా సెక్షన్లు పెట్టారు. ఒక్కడి కోసం అంతమందిపై ఎందుకు కేసు పెట్టారని ఆరా తీస్తే.. వారంతా ప్రతిపక్ష పార్టీకి చెందిన వారని తేలడం గమనార్హం.
తాజాగా సోమవారం కూడా ప్రతిపక్ష పార్టీ ఆశావహుడిపై కేసు నమోదుకు ఆసిఫాబాద్ అధికార పార్టీ నేత పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా అతడిపై కేసు నమోదు చేయడమే కాకుండా అతని ప్రచార రథాన్ని సైతం సీజ్ చేయాలని పోలీసు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇలా నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారనే విమర్శలున్నాయి.
సిర్పూర్ నియోజకవర్గ అధికార పార్టీ నేత మాత్రం ప్రతిపక్ష పార్టీ నేతలకు దీటుగా ప్రతి మండలం, గ్రామంలో పర్యటిస్తూ క్యాడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. అయితే బీఎస్పీకి చెందిన కొందరి నేతలపై మాత్రం తనదైన శైలిలో విరుచుకుపడటమే కాకుండా.. వారికి అండగా నిలుస్తున్న వారిపై కన్నెర్రజేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. మొత్తమ్మీద జరుగుతున్న పరిణామాలను చూస్తే అధికార పార్టీ నేతలు కన్నెర్రజేస్తే మాత్రం ప్రత్యర్థి పార్టీల నేతలకు కష్టాలు తప్పవన్న సంకేతాలు జిల్లాలో రసవత్తర రాజకీయాలకు అద్దం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment