సాక్షి, ఆసిఫాబాద్: కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా కుదేలైపోయింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 10 సార్లు, సిర్పూర్‌లో ఐదుసార్లు హస్తం పార్టీ విజయం సాధించింది. 2018 ఎన్నికల్లోనూ ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి 65,788 ఓట్లు సాధించి గెలుపొందగా, సిర్పూర్‌లో 59,052 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. అంతటి బలమైన ఓటుబ్యాంకు కలిగిన పార్టీ ఈ సారి జిల్లాలో రెండుచోట్లా ఓటమి పాలైంది.
విశ్వసించని జనం..
వాస్తవానికి రాష్ట్రమంతటా కాంగ్రెస్ గాలి వీస్తున్నా.. కుమురం భీం జిల్లాలో మాత్రం పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల వైఖరిపై ఓటరు వ్యతిరేకత కనిపించినట్లు స్పష్టమవుతుంది. పార్టీ పరువు నిలబెట్టేందుకు కొంతమంది కాంగ్రెస్ నేతలు ఖర్చుకు కూడా వెనుకాడలేదు. క్యాడర్‌ను వెనక్కి రప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఇంత దారుణ పరాభవానికి అసలు కారణం.. పార్టీ అభ్యర్థులపై ప్రజలకున్న ఆగ్రహం అని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వచ్చిన ఓట్లు సైతం పార్టీ(హస్తం గుర్తు)ని చూసి వేసినవేనన్న వాదన ఉంది. సిర్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రావి శ్రీనివాస్‌కు కేవలం 8,427 ఓట్లు (4.51శాతం) పడ్డాయి. ఇక్కడ కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడంపై పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
సంప్రదాయ ఓటుబ్యాంకును కాపాడుకోలేక..
సామాజికవర్గ సమీకరణాల నేపథ్యంలో చతుర్ముఖ పోటీ ఉంటుందని అంచనా వేసినా.. అది తిమ్రుఖంగానే మిగిలిపోయింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతపై సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయారు. కనీసం సంప్రదాయ ఓటు బ్యాంకును సైతం కాపాడుకోలేకపోయారు. దీంతో నాలుగంకెల ఓట్లకే పరిమితమయ్యారు. కనీసం డిపాజిట్టు సైతం దక్కించుకోలేకపోయారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి హఠాత్తుగా కాంగ్రెస్ టికెట్టు తెచ్చుకున్న అజ్మీరా శ్యాంనాయక్ విజయం సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి 83,052 ఓట్లు రాబట్టగా, కాంగ్రెస్ అభ్యర్థి శ్యాంనాయక్ 60,242 ఓట్లు సాధించారు. 22,810 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ వైఫల్యాలను శ్యాంనాయక్ తీవ్రస్థాయిలో ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. అయితే ఆయన రాకతో పార్టీలో వర్గపోరు మొదలైంది. చివరకు పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నేతలు కొందరు పార్టీ వీడితే... మరికొందరు అట్టిముట్టనట్టు వ్యవహరించారు. ఇంకొందరు పార్టీలోనే ఉంటూ చివరి క్షణంలో బీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అభ్యర్థి వైఖరి వల్లే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి కారణాలతో పార్టీకి కంచుకోట లాంటి కొన్ని మండలాల్లో ఓట్లు చీలిపోయాయన్న వాదన ఉంది. ఆదివాసీల్లో కొందరు బీఆర్‌ఎస్ అభ్యర్థిపై వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ ఓట్లను తన వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ అభ్యర్థి విఫలమయ్యారు.
ప్రధానంగా గాదిగూడ, నార్నూర్, జైనూర్, సిర్పూర్(యూ), తిర్యాణి, వాంకిడి మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బాగా వెనుకపడటం కూడా ఆయన ఓటమికి కారణమైంది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన గోండు సామాజిక వర్గానికి చెందిన కోట్నాక విజయ్‌కుమార్ ఆదివాసీ ఓట్లను చీల్చగలిగారు. కోట్నాక విజయ్ సాధించిన 16 వేల పైచిలుకు ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిలో ప్రధాన భూమిక పోషించాయి. శ్యాంనాయక్‌కు పడ్డ ఓట్లు.. తన సామాజిక వర్గం, కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానం చూసి వేసినవేనన్న వాదన ఉంది. ఆసిఫాబాద్ పట్టణ, రూరల్ మండల ఓటర్లు బీఆర్‌ఎస్‌కు 50 శాతం ఓట్లు వేయకపోతే మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి విజయావకాశాలు మెరుగయ్యేవి.
Comments
Please login to add a commentAdd a comment