Telangana News: కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం..!
Sakshi News home page

కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం..!

Published Mon, Nov 20 2023 2:00 AM | Last Updated on Wed, Nov 22 2023 11:40 AM

- - Sakshi

నిర్మల్‌/ఖానాపూర్‌/సాక్షి, ఆసిఫాబాద్‌: ‘కుమురంభీమ్, రాంజీగోండు, సమ్మక్క–సారలమ్మ లాంటి వీరుల భూమి ఇది. జల్‌ జంగల్‌ జమీన్‌ కోసం పోరాడిన గడ్డ ఇది. ఆదివాసులది ప్రపంచంలోనే గొప్ప సంస్కృతి. గిరిజన బిడ్డల కోసం ఇందిరమ్మ ఎన్నో చేసింది. అందుకే 40 ఏళ్లయినా దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా తనను గుర్తుచేస్తుంటారు.. కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ అన్నారు.

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం వేర్వేరుగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ఖానాపూర్‌లో పార్టీ అభ్యర్థి వెడ్మ బొజ్జుపటేల్‌ తరఫున, ఆసిఫాబాద్‌లో అభ్యర్థి శ్యాంనాయక్‌ తరఫున ప్రచారం చేశారు. ఆదివాసీ నేతలైన బొజ్జుపటేల్, శ్యాం నాయక్‌ను గెలిపించాలని కోరారు. రెండు సభలు సక్సెస్‌ కావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ కనిపించింది.

భూమి పట్టాలు, ఐటీడీఏలు..
ఆదివాసీలు, గిరిజన బిడ్డల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నో చేసిందని, ఇక ముందూ సంక్షేమ ఫలాలు అందిస్తుందని ప్రియాంకాగాంధీ తెలిపారు. తన నానమ్మకు ఆదివాసీలంటే చాలా ఇష్టమని, వారికోసం చాలా కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. భూములపై హక్కులు, పట్టాలు, పక్కా ఇళ్లు ఇచ్చారన్నారు. గిరిజనుల సంపూర్ణ వికాసం, అభివృద్ధి కోసం ఐటీడీఏలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇందిరమ్మ పుట్టినరోజునే ఇలా ఆదివాసీలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.  

విజన్‌తో అభివృద్ధి చేస్తాం
పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌ ప్రజల కలలను ఒక్కొక్కటిగా నాశనం చేస్తూ వచ్చారని ప్రియాంకాగాంధీ ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, మహిళలకు సంక్షేమ ఫలాలు ఇవ్వలేదని విమర్శించారు. పథకాలు, అభివృద్ధి పేరిట చేపట్టిన పనుల్లో రూ.కోట్లు దోచుకున్నారని, అన్నింట్లో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ను గెలిపిస్తే ముందుచూపుతో ప్రజల అభివృద్ధికి కృషిచేస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే ఆరు గ్యారంటీలను తీసుకువచ్చామని చెప్పారు. ఓటు కోసం వచ్చే బీఆర్‌ఎస్, బీజేపీ ఏం చేశాయో నిలదీయాలని పిలుపునిచ్చారు. ఖానాపూర్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జుపటేల్, నిర్మల్‌ అభ్యర్థి శ్రీహరిరావు, బోథ్‌ అభ్యర్థి ఆడె గజేందర్, ఆదిలాబాద్‌ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డిని వేదికపై చూపిస్తూ వారిని గెలిపించాలని కోరారు.

ఆకట్టుకున్న ప్రసంగం
ఆసిఫాబాద్‌ సభలో ప్రియాంకాగాంధీ ప్రపంచ కప్‌ క్రికెట్‌ గురించి మాట్లాడటంతో సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ఇండియా కచ్చితంగా గెలుస్తుందని.. 1983లో ఇండియా ప్రపంచ కప్‌ గెలుచుకున్న సందర్భంలో తన నానమ్మ ఇందిరాగాంధీ టీం సభ్యులకు ఇచ్చిన విందు గురించి తనకు గుర్తుందని అప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.

ఆమె ప్రసంగాన్ని తెలుగులో అనువాదం చేయడానికి కాంగ్రెస్‌ నేత ఒకరు సిద్ధమవుతుండగా.. ప్రియాంక ‘అనువాదం కావాలా.. హిందీలో ప్రసంగం కొనసాగించనా..’ అని అడగ్గా.. ప్రజలు తెలుగులో అనువాదం కావాలని కోరారు. దీంతో ఆమె తెలుగు అనువాదానికి అంగీకరించి ప్రసంగం కొనసాగించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యువత, అక్కచెల్లెమ్మలు పడుతున్న కష్టాల గురించి చెబుతూ.. ‘కేసీఆర్‌ హయాంలో యువతకు ఉపాధి దొరికిందా? అక్కచెల్లెమ్మల పురోగతికి ప్రభుత్వం పనిచేసిందా?’ అని ప్రియాంక సభికులను ప్రశ్నించగా.. అందరూ ముక్తకంఠంతో లేదు.. లేదు.. అని సమాధానం ఇవ్వడం కనిపించింది.

దాదాపు 50 నిమిషాల పాటు ఆమె ప్రసంగం కొనసాగింది. ఆయా సభల్లో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌రావుచవాన్, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ జోనల్‌ ఇన్‌చార్జి విష్ణునాథ్, ఖానాపూర్‌ పరిశీలకుడు ప్రజ్ఞానంద్‌ ఖర్సె, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్‌చౌదరి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్, రాజురా ఎమ్మెల్యే సుభాష్‌ దోబే, కర్ణాటక ఎమ్మెల్సీ ప్రకాశ్‌రాథోడ్, మాజీ ఎమ్మెల్సీ రాజయ్య, సిర్పూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్, నిర్మల్‌ బోథ్, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు కూచాడి శ్రీహరిరావు, ఆడె గజేందర్, కంది శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు గుండా శ్యాం, మంగ, గణేశ్, అనిల్‌గౌడ్, మునీర్, ఆసిఫ్, సత్తు మల్లేశ్, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, దయానంద్, చిన్నం సత్యం, షబ్బీర్‌పాషా, నిమ్మల రమేశ్, సతీశ్‌రెడ్డి, దుర్గాభవాని, జహీర్‌ హైమద్, మజీద్, గుగ్లావత్‌ రాజు, జంగిలి శంకర్, గంగనర్సయ్య, సలీంఖాన్, సీపీఐ నాయకులు బద్రి సత్యనారాయణ, భోగే ఉపేందర్, అల్లూరి లోకేశ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

గెలిపిస్తారనే నమ్మకంతో ఉన్నం..
‘ఎకరం 38 గుంటల భూమి మాత్రమే ఉన్న పేదోడిని.. ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్న. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డ నాకోసం ఖానాపూర్‌ గడ్డకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్న. ఈ పేదోడికి ఒక్క అవకాశమిచ్చి గెలిపించండి. ఖానాపూర్‌ నియోజకవర్గంలో 33 ఏళ్లుగా కాంగ్రెస్‌ గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలపై నమ్మకంతో ఉన్నారు.

మా నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుతున్న..’ అంటూ ఖానాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జుపటేల్‌ అభ్యర్థించారు. వైఎస్సార్‌ హయాంలో ఖానాపూర్‌, కడెం మండలాల రైతుల చిరకాల స్వప్నం సదర్మాట్‌ బ్యారేజీని మంజూరు చేస్తే, బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్మల్‌ ప్రాంతానికి తరలించినా నేటికీ పూర్తి చేయలేదన్నారు. కడెం ప్రాజెక్ట్‌కు కనీసం మరమ్మతు చేయించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. స్థానికేతరుడిని, తన బినామీతో కేటీఆర్‌ పోటీ చేయిస్తున్నారని, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఆసిఫాబాద్‌ గడ్డ.. కాంగ్రెస్‌ అడ్డా
ఆసిఫాబాద్‌ అభ్యర్థి శ్యాంనాయక్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఆదివాసీలు ఎన్నో కష్టాలు పడుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. వట్టివాగు, అడ ప్రాజెక్టుల్లో నీరున్నా పంటలకు అందించే లేని దుస్థితి ఉందని తెలిపారు. స్థానికంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 10 ఏళ్లున్నా అభివృద్ధి శూన్యమన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైన గుండి బ్రిడ్జి, అప్పపల్లి రహదారి, తుంపల్లి వాగుపై హైలెవెల్‌ బ్రిడ్జి అనార్పల్లి బిడ్జిలతోపాటు ఇతర ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, అంబేద్కర్‌ ఆశయాల మేరకు పని చేస్తానని తెలిపారు. ఆసిఫాబాద్‌ గడ్డపై మరోసారి కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement