ప్రియుడు కాదు.. కిరాతకుడు | Woman Raped and Murdered In Karnataka | Sakshi
Sakshi News home page

ప్రియుడు కాదు.. కిరాతకుడు

Published Thu, Sep 7 2017 8:49 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

ప్రియుడు కాదు.. కిరాతకుడు - Sakshi

ప్రియుడు కాదు.. కిరాతకుడు

  • యువతిపై మిత్రుడితో కలసి అత్యాచారం.. హత్య
  • కర్ణాటకలోని బెళగావి వద్ద దారుణం
  • ఇద్దరు మహారాష్ట్ర యువకుల అరెస్ట్‌

  • సాక్షి, బనశంకరి (బెంగళూరు): ప్రేమించిన యువతిపైనే స్నేహితుడితో కలసి అత్యాచారం చేశాడు ఓ ప్రియుడు. ఆ తర్వాత ఇద్దరూ కలసి యువతిని దారుణంగా హతమార్చారు. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని బెళగావిలో బుధవారం చోటుచేసుకుంది.

    హత్యకు గురైన యువతి, నిందితులు మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించారు. నాగపూర్‌కు చెందిన 22 ఏళ్ల ప్రీతి రెండేళ్లుగా ముంబైలోని ఒక కాల్‌ సెంటర్‌లో పనిచేస్తోంది. అదే నగరానికి చెందిన యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. మంగళవారం ఆ యువతిని రత్నగిరి విహారయాత్రకు అనిచెప్పి తీసుకువచ్చి అక్కడ ఓ లాడ్జిలో దిగారు. అదే రోజు రాత్రి ప్రియుడు తన స్నేహితుడితో కలసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని బయటపెడుతుందేమోనని ఇద్దరూ కలసి ఆ అభాగ్యురాలిని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. తర్వాత యువతి మృతదేహాన్ని బ్యాగులో కుక్కి కారులో బెళగావికి తీసుకువచ్చారు. రాణి కిత్తూరు చెన్నమ్మ వర్సిటీ వద్ద ఉన్న వంతెన కింద పడేసి నిందితులు రత్నగిరికి వెళ్లిపోయారు.

    బుధవారం ఉదయం వారిద్దరూ తిరిగి ముంబైకి ట్యాక్సీలో బయల్దేరారు. మద్యం మత్తులో కారు డ్రైవర్‌కు అమ్మాయిని హత్య చేశామని చెప్పారు. భయబ్రాంతులకు గురైన కారుడ్రైవర్‌ రత్నగిరి పోలీస్‌స్టేషన్‌లో వీరిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం కాగతి ఏరియా పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్ణాటక–మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement