
గాంధీనగర్ : ఫొటో సరదా ఓ భక్తురాలికి చుక్కలు చూపించింది. ఫొటో కోసం ఏనుగు బొమ్మకింద దూరటం ఆమెను ఇబ్బందుల పాలుచేసింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం ఓ గుడికి వెళ్లింది. ఈ సందర్భంగా గుడిలో ఉన్న ఏనుగు బొమ్మతో ఫొటో దిగాలనుకుందామె. అయితే అందరిలాగా ఫొటో దిగితే ఏం వెరైటీ అనుకుందో ఏమో! ఏనుగు బొమ్మ కిందకు అతికష్టం మీద దూరింది. అనంతరం తన స్టైల్లో ఫొటోకు ఫోజిచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది! తర్వాతే అసలు కథ మొదలైంది. ఎంత ప్రయత్నించినా ఆ ఏనుగు కిందనుంచి బయటకు రావటం ఆమె వల్ల కాలేదు. ‘ఎరక్కపోయి దూరాను.. ఇరుక్కుపోయాను కదరా దేవుడా!’ అనుకుంటూ అల్లాడిపోయింది.
ఆమెతో పాటు వచ్చిన కొందరు మహిళలు కాస్త గట్టిగానే ప్రయత్నించి ఆమెను బయటకు లాగారు. దీంతో బయటపడ్డ సదరు మహిళ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తూ.. ఆ భక్తురాలికి.. దెబ్బకు దేవుడు కనిపించాడు.. ఎరక్కపోయి దూరింది.. ఇరుక్కుపోయింది.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment