భోపాల్ : డబ్బుల కోసం కక్కుర్తి పడి ఓ మహిళ పెద్ద పధకమే రచించింది. గోధుమ పిండి ముద్దను అప్పుడే పుట్టిన బిడ్డలా నమ్మించి వేల రూపాయలు అప్పనంగా కొట్టేయాలనుకుంది. కానీ, కథ అడ్డం తిరిగి నలుగురి ముందు నవ్వుల పాలైంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని మొరీనా జిల్లా కైలరాస్‌కు చెందిన ఓ మహిళ ‘‘ఉదయ్ శ్రామిక్ సేవా సహాయత యోజన’’ క్రింద గర్భిణుల షోషకాహారం కోసం రూ. 1400, కాన్పు తర్వాత రూ. 16 వేలు ఇస్తారని తెలుసుకుంది. దీంతో భర్తతో కలిసి ఓ పధకం వేసింది. గోధుమపిండి ముద్దను అప్పుడే పుట్టిన బిడ్డలాగా తయారుచేసి దానికి ఎరుపురంగు పూసింది. ఆ ముద్దమీద ఓ చిన్న గుడ్డముక్క కప్పి ఒళ్లోకి తీసుకుంది. అనంతరం ఏఎన్‌ఎమ్, ఆశా సిబ్బందితో కలిసి అంబులెన్స్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ పిల్లల పేర్లు నమోదు చేసుకునే నర్సు వద్దకు చేరుకున్న మహిళ తన బిడ్డ పేరు రిజిస్టర్‌లో నమోదు చేయాలని కోరింది. బిడ్డని పరీక్ష చేసిన తర్వాతే పేరు నమోదు చేస్తానని నర్సు తెలిపింది. ఇందుకు ఆ మహిళ ఒప్పు కోలేదు. అప్పుడే పుట్టిన బిడ్డను ఇవ్వటం కుదరదని తెగేసి చెప్పింది.
అంతటితో ఆగకుండా మహిళ, ఆమె భర్త అక్కడి సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో సిబ్బంది వారిని బయటకు పంపాలని చూడగా.. ‘‘సరైన సమయంలో వైద్యం అందుంటే నా బిడ్డ బ్రతికి ఉండేది’’ అని ఎరుపు రంగు పూసిన ముద్దను చూపిస్తూ మహిళ ఏడుపు లంఖించుకుంది. అయితే అది గోధుమ పిండితో తయారు చేసిన బొమ్మగా గుర్తించిన డాక్టర్లు షాక్ తిన్నారు. దీనిపై కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ వినోద్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘ పధకం పారకపోయే సరికి వారు అక్కడినుంచి పరారయ్యారు. ప్రభుత్వ పథకం క్రింద సులభంగా డబ్బులు వస్తాయని వాళ్లను ఎవరో తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకున్న మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఆమెకు తెలియదు. సీహెచ్‌సీ అధికారులతో చర్చింకున్న తర్వాత ఆ భార్యాభర్తలపై కేసు పెట్టకూడదని నిశ్చయించుకున్నాము. అలాచేస్తే మా పనికే చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment