హవ్వ.. గ్యాంగ్రేప్ బాధితురాలితో సెల్ఫీనా!
సాధారణంగా అత్యాచార బాధితుల పేర్లు గానీ, వాళ్ల వివరాలు గానీ ఎక్కడా వెల్లడించరు. అలాంటిది రాజస్థాన్ మహిళా కమిషన్ సభ్యురాలు సోమ్యా గుర్జర్ ఏకంగా అలాంటి బాధితురాలితో సెల్ఫీ తీసుకున్నారు! దీంతో కమిషన్ చైర్పర్సన్ ఆమె నుంచి రాతపూర్వక వివరణ కోరారు. అయితే ఇందులో మరింత చింతించాల్సిన విషయం ఏమిటంటే.. కమిషన్ చైర్పర్సన్ సుమన్ శర్మ కూడా ఆ సెల్ఫీలో ఉన్నారు.
జైపూర్లోని ఓ మహిళా పోలీసు స్టేషన్లో బాధితురాలిని కలిసిన సమయంలో గుర్జర్ ఈ సెల్ఫీ తీశారు. అయితే తాను బాధితురాలితో మాట్లాడుతుండగా గుర్జర్ ఈ ఫొటోలు తీశారని, ఆమె తీస్తున్న విషయం కూడా తనకు తెలియదని చైర్పర్సన్ సుమన్ శర్మ చెప్పారు. ఇలాంటి వాటిని తాను సహించేది లేదని, అందుకే ఆమెనుంచి రాతపూర్వక వివరణ కోరానని అన్నారు. గుర్జర్ తీసిన రెండు సెల్ఫీలలో ఒకటి ఇప్పటికే వాట్సప్, ఇతర సోషల్ మీడియా నెట్వర్కులలో విపరీతంగా సర్క్యులేట్ అయింది.
రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో భర్త, అతడి ఇద్దరు సోదరులు కలిసి 30 ఏళ్ల బాధితురాలిపై అత్యాచారం చేశారు. రూ. 51 వేలు కట్నంగా ఇవ్వలేదని ఆమె నుదురు, చేతుల మీద అసభ్యకరమైన మాటలతో పాటు ‘మా నాన్న దొంగ’ అంటూ టాటూలు వేయించారు. దీనిపై ఇప్పటికే 498 ఎ, 376, 406 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.