పరారీలో మరో నిందితుడు
రూ.5,200 నగదు, రెండు బైక్‌లు స్వాధీనం
అందరూ కరడుగట్టిన నేరస్తులే
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ వి.రత్న
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం నల్లబొమ్మనపల్లి సమీపంలో అత్తాకోడలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వి.రత్న మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వారి నుంచి రూ.5,200 నగదు, రెండు మోటార్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
హిందూపురం త్యాగరాజనగర్‌కు చెందిన ఎరికల కావడి నాగేంద్ర, సాకే ప్రవీణ్‌కుమార్, మరో ముగ్గురిని సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు హిందూపురం–పాలసముద్రం రోడ్డులోని బిట్ కాలేజీ వెనుక వైపున డంపింగ్ యార్డ్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. హిందూపురం త్యాగరాజనగర్ గుడ్డం ఏరియాలో ఉంటున్న చాకలి శ్రీనివాసులు అలియాస్ శ్రీనాథ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.
ఈ కేసుల్లో పట్టుబడ్డ నిందితులు కరడుగట్టిన నేరస్తులేనని, వారిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. ఎరికల కావడి నాగేంద్ర దోపిడీ, అత్యాచార కేసుల్లో నిందితుడని, అతనిపై అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 37కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. సాకే ప్రవీణ్‌కుమార్‌పై లేపాక్షి పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైందన్నారు.
పరారీలో ఉన్న చాకలి శ్రీనివాసులు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ కేసులో ముద్దాయని తెలిపారు. ఇతని స్వగ్రామం లేపాక్షి మండలం కల్లూరు కాగా.. ప్రస్తుతం హిందూపురం త్యాగరాజనగర్ గుడ్డం ఏరియాలో ఉంటున్నాడన్నారు.
స్పెషల్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చూస్తాం: ఎస్పీ
నిందితులకు స్పెషల్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. ఘటన జరిగిన 48 గంటల్లోపే నిందితులను అరెస్టు చేశామన్నారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
కేసును ఛేదించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీ వి.రత్న, ఇతర పోలీస్ అధికారులను సీఎం, హోంమంత్రి, డీజీపీలు ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ వి.రత్న, డీఎస్పీ మహేష్ నగదు రివార్డులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment