ప్రతీకాత్మక చిత్రం
కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని సామెత
కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రసూతి చట్టం ఈ సామెతకి మరోపేరులా మారిపోనుందా ?
గర్భిణుల కెరీర్‌కు ఆటంకాలు ఉండకూడదన్న సదుద్దేశంతో ప్రసూతి చట్టానికి చేసిన సవరణలు వారి ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నాయా ?
అవుననే అంటోంది టీమ్‌లీజ్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ సంస్థ తాజాగా చేసిన సర్వేలో ప్రసూతి చట్టం వ్యతిరేక ఫలితాల్నే తీసుకువస్తోందని వెల్లడైంది.
తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం, పిల్లలు పుట్టినా మహిళలు ఉద్యోగాల్లో కొనసాగేలా ఉండాలన్న ఉద్దేశంతో ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాల వరకు పెంచుతూ గత ఏడాది ప్రసూతి చట్టానికి చేసిన సవరణలు మహిళలకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయి. ఈ చట్టం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10 సెక్టార్లలో 11 నుంచి 18 లక్షల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోతారని టీమ్‌లీజ్ సర్వీసెస్ లిమిటెడ్ తాజా సర్వేలో వెల్లడైంది. అదే అన్ని రంగాల్లోనూ ఇదే స్థాయిలో చట్టం ప్రభావం ఉంటే కోటి నుంచి 1.2 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోతారని ఆ సర్వే అంచనా వేసింది.
ఏయే రంగాల్లో సర్వే
విమానయాన రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సర్వీసులు, రియల్ ఎస్టేట్, విద్య, ఈ కామర్స్, తయారీ రంగం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రిటైల్, పర్యాటకం వంటి రంగాలకు సంబంధించిన 300 కంపెనీల యాజమాన్యాల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ రంగాలకి సంబంధించి అతి పెద్ద కంపెనీలు, ఆర్థిక పరిపుష్టి కలిగినవి ప్రసూతి చట్టాన్ని స్వాగతిస్తే, చిన్న మధ్యతరహా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఎందుకీ ప్రతికూల ప్రభావం
ప్రసూతి సెలవు తర్వాత కూడా మహిళా ఉద్యోగుల్ని కొనసాగించాలంటే సాధారణ కంపెనీలకు ఉద్యోగుల వార్షిక వేతనంలో 80 నుంచి 90 శాతం ఖర్చు అయితే, ఇక శ్రామిక రంగానికి సంబంధించిన ఉద్యోగుల వార్షిక వేతనంలో 135 శాతం ఖర్చు అవుతుంది. అంత ఖర్చుని భరించడానికి చాలా కంపెనీ యాజమాన్యాలు విముఖత ప్రదర్శిస్తున్నాయి. వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ చట్టం ప్రకారం 50మందికి పైగా ఉద్యోగులు ఉన్న ప్రతీ కంపెనీ ఆఫీసుల్లో క్రష్ ఏర్పాటుచేయాలి. అందుకే చిన్న కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు మహిళలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. మరి కొన్ని కంపెనీలు వేరే సాకులతో మహిళల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి.
విదేశాల్లో ఏం చేస్తారు ?
అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు ప్రసూతి సెలవులకయ్యే ఖర్చుని ఆమె పనిచేసే సంస్థలు భరించవు. సదరు కంపెనీలపై పడే ఆర్థిక భారాన్ని ఎంతో కొంత ప్రభుత్వాలే భరిస్తాయి. పన్నుల్లో మినహాయింపులు కూడా ఇస్తాయి. యూకే వంటిదేశాల్లో మహిళలు 52 వారాల వరకు ప్రసూతి సెలవును తీసుకునే సదుపాయం ఉంది. అక్కడ కంపెనీలు ఆదాయం 45 వేల పౌండ్ల కంటే తక్కువ ఉంటే ప్రభుత్వమే మొత్తం భరిస్తుంది. ఇక పెద్ద కంపెనీలకైతే 92 శాతం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. కానీ భారత్‌లో అలా జరగడం లేదు. ఇలాంటి సంస్కరణలు తీసుకువచ్చినప్పుడు చిన్న, మధ్య తరగతి కంపెనీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తే మహిళల ఉద్యోగాలకు భద్రత ఉంటుందని ఒక అంతర్జాతీయ సంస్థకు చెందిన ఎండీ కె. సుదర్శన్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా చిన్న, మధ్య తరగతి కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతోనే నడుపుతాయి. ఒకేసారి అయిదుగురు మహిళల్లో ఇద్దరు ప్రసూతి సెలవు తీసుకుంటే ఆ కంపెనీయే కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు.
-సాక్షి నాలెజ్డ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment