
సాక్షి,న్యూఢిల్లీ: ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛ పరిరక్షణకు కట్టుబడి ఉన్నప్పటికీ ఇంటర్‌నెట్‌పై ఏ ఒక్కరి గుత్తాధిపత్యాన్నీ అనుమతించదని ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియా పర్యవసానాల ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను భారత్ ఎలా అధిగమిస్తుందనే దానిపై మంత్రి వివరణ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్‌లో తగిన చట్టాలున్నాయని చెప్పారు.
డిజిటల్ విప్లవం అందరికీ చేరేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే డిజిటల్ గుత్తాధిపత్యాన్ని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు. సాంకేతికత అభివృద్ధికి దోహదపడేలా ఉంటూ తక్కువ వ్యయంలో అందుబాటులో ఉండాలని అన్నారు.
భారత్ సాంకేతిక ప్రగతిని అందిపుచ్చుకోవాలని పలు ఆసియా, ఆఫ్రికా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. ఇంటర్‌నెట్‌ను ఏ కొద్ది మందో ఆవిష్కరించినా ప్రస్తుతం అంది అంతర్జాతీయ ప్రజల ఆస్తిగా మారిందన్నారు. ప్రజలందరికీ అతితక్కువ ధరకు, భద్రతతో కూడిన ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావాలని చెప్పారు. ఫేస్‌బుక్, వాట్పాప్ వంటి దిగ్గజ సంస్థకు భారత్ భారీ మార్కెట్‌గా ఎదిగిందని అన్నారు.