
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రపంచ బ్యాంకు ప్రశంసల జల్లు కురిపించింది. భారత్‌ని మోదీ వెలుగుల బాట పట్టించారని వ్యాఖ్యానించింది. 2010 నుంచి 2016 వరకు ప్రతియేడు 30 మిలియన్ల జనాభాకి భారత్‌లో విద్యుత్ కాంతులు అందించారని ప్రపంచ బ్యాంకు ఈ వారం విడుదల చేసిన ‘విద్యుదీకరణలో ప్రగతి’ నివేదికలో వెల్లడించింది. 125 కోట్ల జనాభా గల దేశంలో 85 శాతం జనావళికి విద్యుత్ సౌకర్యం కల్పించడం మామూలు విషయం కాదనీ.. భారత్ కృషి ఎనలేనిదని కొనియాడింది. దేశంలోని ప్రతి గ్రామానికి కరెంటు సౌకర్యం కల్పిస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన వారంలోపే ఈ నివేదిక రావడం గమనార్హం.
2030 వరకల్లా ప్రపంచంమంతా విద్యుదీకరణ జరగాలనే లక్ష్యాన్ని భారత్ ముందుగానే చేరుకుంటుందని ఈ నివేదిక విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే మిగతా 15 శాతం జనాభాకి విద్యుత్ సౌకర్యం కల్పించడం కష్టసాధ్యం కావొచ్చని అభిప్రాయపడింది. కొండలు, గుట్టలలతో కూడిన ప్రాంతాలకు విద్యుత్ వెలుగులు అందించడం కొంత ఆలస్యమైనా గడువులోపల భారత్ తన లక్ష్యాన్ని చేరుకుంటుందని ‘విద్యుదీకరణలో ప్రగతి’ నివేదిక తయారు చేసిన ఫోస్టర్ ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో విద్యుదీకరణ పథకం అమలు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు.. కరెంటు కనెక్షన్ గల ఇళ్ల ప్రాతిపదికగా తమ రిపోర్టు సాగిందనీ.. కానీ భారత ప్రభుత్వం అధకారికంగా విద్యుత్ కనెక్షన్ కల్గిన గృహాలను మాత్రమే లెక్కలోకి తీసుకుందని ఆమె చెప్పారు. ‘ఆ ప్రకారం మా నివేదికలో 85 శాతం భారత ప్రజలు విద్యుత్ సౌకర్యం కల్గి ఉన్నారని తేలగా.. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం అది 80 శాతం కన్నా తక్కువ అని వెల్లడైంద’ని ఫోస్టర్ పేర్కొన్నారు.
నిజం చెప్పాలంటే విద్యుదీకరణలో భారత్ చేసిన కృషి ఇంతకుముందు ఏ దేశం చేయలేదని ఆమె అన్నారు. అయినప్పటికీ భారత్ పెద్ద దేశం కావడం వల్ల విద్యుదీకరణలో బంగ్లాదేశ్, కెన్యాల కంటే వెనుకే నిలిచిందని తెలిపారు.భారత చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం సఫలం అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే సౌకర్యంతో పాటు సేవలు కూడా త్వరితంగా అందించడంలో భారత్ ఇంకా మెరుగుపడాలని ఆమె వ్యాఖ్యానించారు. 2020 నాటికి మరో 250 మిలియన్ల జనాభాకి వెలుగు అందించడం ద్వారా సంపూర్ణ భారతానికి విద్యుత్ వెలుగులు సొంతమవుతాయని ‘విద్యుదీకరణలో ప్రగతి’ నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment