
న్యూఢిల్లీ : మీకు సంగీతం ఇష్టమా? మ్యూజిక్ వినడానికి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తారా? అయితే, 4 నిమిషాలకు మించి ఇయర్ ఫోన్స్‌తో సంగీతం వినడం ప్రమాదమనే విషయం మీకు తెలుసా? తెలిసీ గంటల తరబడి ఇయర్ ఫోన్స్‌ను వినియోగిస్తున్నారా? అయితే మీరు వినికిడి సమస్యను ఎదుర్కొనక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరిచ్చింది.
ఆపకుండా అదే పనిగా ఎక్కువ సమయం పాటు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినేవారికి చెవుడు వచ్చే ప్రమాదముందని తెలిపింది. పెద్దపెద్ద శబ్దాల వల్ల కలిగే వినికిడి సమస్యకు చికిత్స లేదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చెవిలోని కణాలు చాలా సున్నితంగా ఉంటాయని, అవి దెబ్బతింటే తిరిగి వాటిని సరిచేయలేమని, వినికిడి పరికరాలు వాడడం తప్ప మరో మార్గమే లేదని చెబుతున్నారు. భారత్‌లో వయసు పెరగడం ద్వారా తలెత్తే వినికిడి సమస్యలకంటే పెద్ద శబ్దాలు వినడం వల్ల వినికిడి సమస్యలబారిన పడుతున్నవారే ఎక్కువమంది ఉంటున్నారని భారత్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ వెల్లడించింది.