ప్రపంచంలో ఎత్తైన 'శాంటాక్లాజ్' సైకత శిల్పం
పూరి: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రఖ్యాత భారతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్లో 45 అడుగుల ఎత్తు ఉన్న శాంటాక్లాజ్ సైకతశిల్పాన్ని గురువారం ఏర్పాటుచేశారు. 'ప్రపంచశాంతి' అనే సందేశంతో శాంటాక్లాజ్‌ను రూపొందించి అందరి దృష్టినీ ఆకర్షించారు. దాంతో ఆయన రూపొందించిన ఈ సైకత శిల్పం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శాంటాశిల్పంగా గుర్తింపుపొందనుంది. ఈ శిల్పాన్ని రూపొందించడానికి వేయి టన్నుల ఇసుకను వివిధ వర్ణాల రంగులతో ఉపయోగించినట్టు సుదర్శన్ వెల్లడించారు.
ఇందుకోసం పూరిలోని ఆయన శాండ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో 20మంది విద్యార్థుల సహాయంతో ఈ సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు. దీన్ని సరైన ఆకృతిని రూపొందించడానికి వారికి రెండు రోజల్లో 22 గంటల పాటు సమయం పట్టింది. ఈ రోజు నుంచి జనవరి 1 వరకు శాంటా సైకిత శిల్పాన్ని ప్రదర్శించనున్నారు. అదేవిధంగా సుదర్శన్ యేసు, మేరీ మాతల సైకత శిల్పాలను కూడా రూపొందించారు. అంతేకాక తన సైకత శిల్పాలను 'లిమ్కా బుక్' రికార్డ్స్‌లో చేర్చాల్సిందిగా వారిని పట్నాయక్ కోరారు.