
న్యూఢిల్లీ: దాదాపు 50 ఏళ్ల క్రితం గల్లంతైన ఓ భారత వాయుసేన విమానం అవశేషాలను తాజాగా గుర్తించారు. ఆదివారం ఈ విమాన శకలాలు ఢాకాలో బయటపడ్డాయి. ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్-12-534 విమానం 1968 ఫిబ్రవరి 7న గల్లంతైంది. అప్పటి నుంచి దీని ఆచూకీ లభ్యం కాలేదు. ఐఏఎఫ్ సిబ్బంది దీని కోసం తీవ్రంగా గాలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీనిలో ఉన్న సిబ్బంది గురించి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ క్రమంలో 2003లో హిమాలయన్ మౌంటనేరింగ్ ఇనిస్టిట్యూట్ సభ్యులు విమానంలో ప్రయాణించిన సిపాయ్ బేలీరామ్ మృతదేహాన్ని గుర్తించారు. దాంతో వాయుసేన మరోసారి గాలింపు చర్యలను ఉధృతం చేయగా 2007లో మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. అయితే 2009 నుంచి ఈ గాలింపు చర్యలను నిలిపివేశారు.
అయితే గతేడాది జూలైలో విమానానికి సంబంధించిన కొన్ని శకలాలు ఢాకా గ్లేషియర్‌లో పడినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సంయుక్తంగా మరోసారి గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఆదివారం విమానానికి సంబంధించిన ప్రధాన భాగాలు లభ్యమయ్యాయి. ఏరో ఇంజిన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఇంధన ట్యాంక్ యూనిట్, ఎయిర్‌బ్రేక్ అసెంబ్లీ, కాక్‌పిట్ డోర్ తదితర భాగాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌ఫోర్స్ చరిత్రలో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో దీన్ని ఒకటిగా చెబుతారు.
1968 ఫిబ్రవరి 7న 98 మంది రక్షణశాఖ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ విమానం మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లించాలని గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది పైలట్‌కు సమాచారమిచ్చారు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి చండీగఢ్‌కు మళ్లించారు. అయితే మార్గమధ్యంలో రోహ్తంగ్ పాస్ మీదుగా ప్రయాణిస్తుండగా ఈ విమానానికి కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది దీని కోసం తీవ్రంగా గాలించినప్పటికి ఫలితం దక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment