IAF Plane
-
వుహాన్‌కు భారత్ మందులు
న్యూఢిల్లీ/సియోల్/బీజింగ్: కోవిడ్–19 వైరస్ ప్రభావిత ప్రాంతమైన చైనాలోని వుహాన్ ప్రాంతానికి భారత్ సుమారు 15 టన్నుల మందులను పంపింది. భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన విమానంలో బుధవారం ఈ మందులను తరలించారు. వుహాన్‌కు వెళ్లేందుకు భారత్‌కు చెందిన విమానాలకు అనుమతులివ్వడంలో చైనా కావాలనే ఆలస్యం చేస్తోందని గత వారం భారత్ ప్రకటించడం తెల్సిందే. విమానం తిరిగొస్తూ 80 మంది భారతీయులు, చుట్టుపక్కల దేశాల నుంచి 40 మందిని భారత్‌కు తీసుకురానుంది. విమానంలో మాస్కులు, గ్లోవ్స్, ఇతర అత్యవసర వైద్య పరికరాలను పంపిస్తున్నట్లు తెలిపింది. ద.కొరియాలో కోవిడ్ పైపైకి చైనాలో కోవిడ్–19 (కరోనా వైరస్) బాధితుల సంఖ్య క్రమేపీ తగ్గుతుంటే మరోవైపు దక్షిణ కొరియాలో వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. బుధవారం ఒక్కరోజే 134 మంది కోవిడ్ బారిన పడ్డారు. చైనాలో కోవిడ్ తీవ్రత క్రమేపీ తగ్గుతోంది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మంగళవారం 52 మంది వైరస్సోకి మరణించారు. ఇప్పటివరకూ ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 2715కు చేరుకోగా, వ్యాధితో ఉన్న వారి సంఖ్య 78,064కు చేరింది. -
51 ఏళ్ల తర్వాత బయటపడింది
న్యూఢిల్లీ: దాదాపు 50 ఏళ్ల క్రితం గల్లంతైన ఓ భారత వాయుసేన విమానం అవశేషాలను తాజాగా గుర్తించారు. ఆదివారం ఈ విమాన శకలాలు ఢాకాలో బయటపడ్డాయి. ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్-12-534 విమానం 1968 ఫిబ్రవరి 7న గల్లంతైంది. అప్పటి నుంచి దీని ఆచూకీ లభ్యం కాలేదు. ఐఏఎఫ్ సిబ్బంది దీని కోసం తీవ్రంగా గాలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీనిలో ఉన్న సిబ్బంది గురించి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ క్రమంలో 2003లో హిమాలయన్ మౌంటనేరింగ్ ఇనిస్టిట్యూట్ సభ్యులు విమానంలో ప్రయాణించిన సిపాయ్ బేలీరామ్ మృతదేహాన్ని గుర్తించారు. దాంతో వాయుసేన మరోసారి గాలింపు చర్యలను ఉధృతం చేయగా 2007లో మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. అయితే 2009 నుంచి ఈ గాలింపు చర్యలను నిలిపివేశారు. అయితే గతేడాది జూలైలో విమానానికి సంబంధించిన కొన్ని శకలాలు ఢాకా గ్లేషియర్‌లో పడినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సంయుక్తంగా మరోసారి గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఆదివారం విమానానికి సంబంధించిన ప్రధాన భాగాలు లభ్యమయ్యాయి. ఏరో ఇంజిన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఇంధన ట్యాంక్ యూనిట్, ఎయిర్‌బ్రేక్ అసెంబ్లీ, కాక్‌పిట్ డోర్ తదితర భాగాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌ఫోర్స్ చరిత్రలో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో దీన్ని ఒకటిగా చెబుతారు. 1968 ఫిబ్రవరి 7న 98 మంది రక్షణశాఖ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ విమానం మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లించాలని గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది పైలట్‌కు సమాచారమిచ్చారు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి చండీగఢ్‌కు మళ్లించారు. అయితే మార్గమధ్యంలో రోహ్తంగ్ పాస్ మీదుగా ప్రయాణిస్తుండగా ఈ విమానానికి కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది దీని కోసం తీవ్రంగా గాలించినప్పటికి ఫలితం దక్కలేదు. -
మూడు రోజులైనా జాడ లేని విమానం
న్యూఢిల్లీ : గత మూడు రోజులుగా ఆచూకీ లభించని ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 13 మంది సభ్యులతో కూడిన ఏఎన్-32 విమానం అసోంలోని జోర్హాట్ నుంచి సోమవారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆచూకీ గల్లంతైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెచుకా బేస్‌లో విమానం ల్యాండ్ కాకపోవడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసినా ఇప్పటివరకూ విమానం జాడ పసిగట్టలేకపోయారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ సియోంగ్ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో పలు బృందాలు విమానం ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండటంతో పాటు ప్రతికూల వాతావరణం గాలింపు చర్యలకు అవరోధంగా మారాయి. హెలికాఫ్టర్లు, ఇస్రో శాటిలైట్లు, నేవీకి చెందిన పీ-8ఐ విమానం సహా పలు బృందాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. -
వీణా మాలిక్ వివాదాస్పద ట్వీట్
న్యూఢిల్లీ : భారత్‌లో డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించిన విషయం విస్మరిస్తూ పాక్ నటి వీణా మాలిక్ గల్లంతైన ఐఏఎఫ్ విమానం ఏఎన్-32పై వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాడార్ కామెంట్‌ను ప్రస్తావిస్తూ ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం వాస్తవంగా కూలిపోలేదని, వాతావరణం మేఘావృతం కావడంతో దాన్ని గుర్తించలేకపోతున్నారని ఆమె ట్వీట్ చేశారు. ఆకాశంలో మేఘాలు దట్టంగా అలుముకోవడంతో రాడార్లు గల్లంతైన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానాన్ని కనుగొనలేకపోతున్నారని స్మైలీ ఇమేజ్‌తో ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అసోంలోని జోర్హాట్లో సోమవారం సాయంత్రం 13 మంది సిబ్బందితో టేకాఫ్ అయిన భారత వైమానిక దళానికి చెందిన విమానం ఆచూకీ గల్లంతైన సంగతి తెలిసిందే. అదృశ్యమైన విమానాన్ని గుర్తించేందుకు ఇస్రో శాటిలైట్లు, నావల్ పీ-8ఐ గూఢచర్య విమానాలు రంగంలోకి దిగాయి. కాగా భారత్‌లో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌లో పాల్గొన్న అనంతరం ప్రాచుర్యంలోకి వచ్చిన వీణా మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఐఏఎఫ్ పైలట్ అభినందన్ వర్ధమాన్ పాక్ దళాలకు పట్టుబడిన సందర్భంలోనూ ఆమె చేసిన ట్వీట్ దుమారం రేపింది. -
ఆ శకలం గల్లంతైన విమానానిదేనా?
సాక్షి, చెన్నై : బంగాళాఖాతంపై అదృశ్యమైన ఏఎన్-32 ఎయిర్‌ఫోర్స్ విమానం కోసం అన్వేషణ తీవ్రతరమైంది. అయితే చెన్నైకి 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఓ వస్తువు లభించినట్లు సమాచారం. అది విమాన శకలమా లేక మరొకటా అనేది తెలియాల్సిఉంది. వస్తువు లభించిన ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్వయంగా సెర్చ్ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. ఏఎన్-32 ఎయిర్‌ఫోర్స్ విమానం ఆచూకీ కోసం భారత నౌకాదళం, కోస్టుగార్డు, వైమానిక దళం వర్గాలు జలాంతర్గామి, ఎనిమిది విమానాలు, 18 నౌకలతో ఆచూకీ కోసం అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. గల్లంతైన విమానంలో ప్రయాణించిన 29 మంది జాడ కోసం వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. రక్షణ మంత్రి పర్యవేక్షణ: ఏఎన్ -32 గల్లంతు సమాచారంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శనివారం ఉదయమే తమిళనాడుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అరక్కోణం వైమానిక దళానికి, అక్కడ అదృశ్యమైన విమానానికి సంబంధించి సిద్ధం చేసిన ఫొటోలను పరిశీలించారు. గాలింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాలింపులో సాంకేతిక పరిజ్ఞానం, ఆ విమానానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బంగాళాఖాతంలో ఏఎన్-32 విమానంతో సంబంధాలు తెగినట్టుగా భావిస్తున్న ప్రదేశం వరకు పర్యటించారు. గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. తదుపరి తాంబరం ఎయిర్‌బేస్‌కు చేరుకుని వైమానిక, నౌకాదళం వర్గాలతో చర్చించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి పర్యవేక్షణలో ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించినట్టు సమాచారం. ఈ కమిటీ ప్రాథమిక విచారణ ప్రారంభించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో వైమానిక, నౌకాదళం వర్గాలతో పాటు, సాంకేతిక నిపుణుల్ని నియమించినట్టు తెలిసింది. చెన్నై నుంచి బయలుదేరిన విమానంలో చెన్నైకు చెందిన ముత్తుకృష్ణన్ అనే వ్యక్తి ఉన్నట్టు సమాచారం.