గుర్మెహర్ కౌర్ ట్వీట్ పై దుమారం
న్యూఢిల్లీ:తన తండ్రి మణ్ దీప్ సింగ్ కు చావుకు పాకిస్తాన్ కారణం కాదని, ఆనాటి కార్గిల్ యుద్ధమే కారణమని ఢిల్లీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ చేసిన ట్వీట్ పై దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆ ట్వీట్ పై భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా స్పందించగా, తాజాగా రెజ్లర్ యోగశ్వర్ దత్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. ఆల్ ఖైదా వ్యవస్ధాపకుడు ఒసామా బిన్ లాడెన్ ప్రజల్ని చంపలేదని, బాంబులే ఆ పని చేశాయని యోగేశ్వర్ ట్వీట్ చేశాడు. ఒకనాటి జర్మనీ నియంత హిట్లర్ కూడా తనను వ్యతిరేకించిన జ్యూస్కు చావుకు కారణం కాలేదని, అతను ప్రయోగించిన గ్యాసే ఆ పని చేసిందని చమత్కరించాడు. ఈ మేరకు ఫోటోను ట్వీట్టర్లో పోస్ట్ చేసి గుర్మెహర్ కు కౌంటర్ ఇచ్చాడు.
అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే తరహాలో గుర్మెహర్ ట్వీట్ ను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తన టెస్టు కెరీర్లో చేసిన రెండు ట్రిపుల్ సెంచరీలను చేసింది తాను కాదని, అవి చేసింది బ్యాట్ అని రిప్లే ఇచ్చాడు. ఇప్పడు సెహ్వాగ్ సరసన యోగేశ్వర్ దత్ కూడా చేరిపోయాడు. గుర్మెహర్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన యోగేశ్వర్.. ఫ్లకార్డుతో ఉన్న ఆమె ఫోటోకు మరో మూడు ఫోటోల్ని జోడించి మరీ విమర్శించాడు.
1999 కార్గిల్ యుద్ధంలో కెప్టెన్ గా పని చేసిన మణ్దీప్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. దానిపై అతని కుమార్తె గుర్మెహర్ ఇటీవల ట్వీట్ చేసింది. తన తండ్రి అమరుడు కావడానికి పాకిస్తాన్ కాదని పేర్కొంది. యుద్ధమే తన తండ్రిని చంపిందని ఆ ట్వీట్ లో పేర్కొంది. దాంతో పాటు ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని గుర్మెహర్ తీవ్రంగా ఖండించింది. ఆ క్రమంలోనే తర్వాత గుర్‌మెహర్ సోషల్ మీడియాలో నిత్యం పోస్ట్‌లు చేస్తోంది. దీనిలో భాగంగా తనను రేప్ చేస్తామని ఏబీవీపీ కార్యకర్తలు బెదిరించారని ఆరోపించింది.దాంతో పాటు వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్‌పై కూడా గుర్మెహర్ స్పందించింది. సెహ్వాగ్ చేసిన ట్వీట్ చూడగానే తనకు చాలా బాధ కలిగిందని, తన చిన్నతనం నుంచి ఆయనను చూస్తున్నానని, తనను ఉద్దేశిస్తూ ఎందుకు ఇలా ట్వీట్ చేశాడోనని ఆవేదన వ్యక్తం చేసింది.
🙈🙈🙈 pic.twitter.com/SiH90ouWee
— Yogeshwar Dutt (@DuttYogi) 28 February 2017