మెమన్ మృతదేహం బంధువులకు అప్పగింత
ముంబై : ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు. ముంబై పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం ఉదయం నాగపూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలా వద్దా అనే అంశంపై అధికారులు చివరి వరకూ తర్జనభర్జన పడ్డారు. చివరకు కుటుంబ సభ్యులకే మెమన్ మృతదేహాన్ని అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
దాంతో నాగపూర్ సెంట్రల్ జైలు నుండి అంత్యక్రియల నిమిత్తం ప్రత్యేక అంబులెన్స్ లో కుటుంబసభ్యులు ముంబైకి తీసుకు వెళ్లారు. ముంబైలోని బాదా కబరిస్తాన్ లేది మెరైన్స్ లైన్స్, మాహింలోగాని మెమన్ అంతిమ సంస్కారాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాహింలోనే యాకూబ్ అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముంబై అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఎలాంటి అల్లర్లు జరగకుండా భద్రతను పెంచారు.
కాగా జైలు అధికారుల నిర్ణయం మీదట యాకూబ్ మెమన్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని కెపి బక్సి వెల్లడించారు. అయితే కొన్ని ప్రత్యేక నిబంధనలను జైలు అధికారులు విధించారని తెలిపారు.