సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: దిల్‌సుఖ్‌నగర్ జంటపేలుళ్ల కేసులో నిందితుడైన ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు, ఉగ్రవాది యాసిన్ భత్కల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) హైదరాబాద్ విభాగ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని హైదరాబాద్‌కు తీసుకురావడానికి వీలుగా ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌కు ఢిల్లీ కోర్టు శనివారం అనుమతించింది.
దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో శనివారంతో యాసిన్ భత్కల్ కస్టడీ ముగియడంతో శనివారం అతన్ని ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. అయితే దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో అతన్ని విచారించేందుకు హైదరాబాద్‌కు తీసుకెళ్లడానికి అనుమతి కోరుతూ ఎన్‌ఐఏ హైదరాబాద్ విభాగ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రెండ్రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధిస్తూ జడ్జి ఐ.ఎస్.మెహతా ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు భత్కల్‌ను ఆదివారం హైదరాబాద్‌కు తీసుకొచ్చి 23వ తేదీన ఇక్కడి కోర్టులో హాజరుపరచనున్నారు.