ట్యాంకర్లు, రైళ్లే బాంబులు
సాక్షి, హైదరాబాద్: ‘టార్గెట్ చేసిన ప్రాంతాల్లో బాంబుల్ని పేల్చినప్పుడు పదుల సంఖ్యలోనే మరణిస్తున్నారు. అదును చూసుకుని వీటి స్థానంలో ట్యాంకర్లు, రైళ్లను పేలిస్తే...’ నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పన్నాగమిది. దీనికోసం మాగ్నెటిక్ పరిజ్ఞానంతో పనిచేసే బాంబుల్ని తయారుచేస్తోంది. ఈ కుట్రను అమలుచేసే బాధ్యతల్ని తెహసీన్ అక్తర్ మాడ్యుల్‌కు అప్పగించింది. ప్రస్తుతం బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్న ఐఎం సహ వ్యవస్థాపకుడు, దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు యాసిన్ భత్కల్ బయటపెట్టిన విషయాలివి.
గత సెప్టెంబర్‌లో కర్ణాటకలోని మంగళూరులో ఉన్న ఐఎం స్థావరంలో పోలీసులు చేసిన సోదాల్లో చిక్కిన 90 బాంబుల్లో కొన్ని మాగ్నెటిక్ పరిజ్ఞానంతో కలిగినవి కూడా ఉండటం దీనికి బలాన్నిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్ కరాచీలోని డిఫెన్స్ ఏరియాలో తలదాచుకున్న ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు ఇది జరుగుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
తెహసీన్ కనుసన్నల్లో 13 మాడ్యుల్స్...
యాసిన్ భత్కల్ అరెస్టు తర్వాత పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన తెహసీన్ అక్తర్ దేశ వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో 13 మాడ్యుల్స్‌ను తయారుచేసుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
- ఉత్తరప్రదేశ్‌లోని ఆజాంగఢ్‌లో ఐదు, బీహార్‌లోని దర్భంగాలో నాలుగు, ఛత్తీస్‌గఢ్‌లోని రాంచీలో ఒకటి, కర్ణాటకలోని మంగుళూరు పరిసరాల్లో మరో రెండింటితో పాటు హైదరాబాద్‌లోనూ వీటిని విస్తరించినట్లు భావిస్తున్నారు.
- అయస్కాంత పరిజ్ఞానంతో కూడిన ఐఈడీలను పేల్చడానికి వీటిని వినియోగించవచ్చని
హెచ్చరిస్తున్నాయి.
- ఈ తరహా బాంబుల తయారీ, వీటి రూపురేఖలతో పాటు ఇంధనాన్ని రవాణా చేసే ట్యాంకర్లు, రైళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన మార్గదర్శకాలు, విధివిధానాలను రూపొందించి సంబంధిత విభాగాలకు పంపేందుకు కేంద్ర నిఘా వర్గాలు కసరత్తు ప్రారంభించాయి.
రైల్వేస్టేషన్లు, జనసమ్మర్ద ప్రాంతాలే లక్ష్యం
- ఈ ఆధునిక మాగ్నెటిక్ మెకానిజంతో కూడిన ఐఈడీలను ట్యాంకర్లు, రైళ్లకు అతికించే ముందు అవి ప్రయాణించే మార్గాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఐఎం ఉగ్రవాదులకు స్పష్టంచేసింది.
- జనసమ్మర్ద ప్రాంతాలు, కీలక రైల్వేస్టేషన్ల మీదుగా వెళ్లే వాటిని ఎంచుకుని వీటిని పేలిస్తేనే అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయని ఉగ్ర సంస్థ భావిస్తోంది.
- పరారీలో ఉన్న ఉగ్రవాదులు తెహసీన్ అక్తర్, వకాస్లు ఈ బాంబుల్ని తయారుచేయడంలో నిష్ణాతులైనప్పటికీ రెండో వ్యక్తి పాకిస్థానీ కావడంతో స్లీపర్ సెల్స్ సహకారంతో ఈ ఆపరేషన్లు పూర్తిచేసే బాధ్యతల్ని తెహసీన్కే భత్కల్ అప్పగించాడని నిఘా వర్గాలు గుర్తించాయి.
- గత సెప్టెంబర్‌లో దర్యాప్తు అధికారులు మంగళూరులో ఉన్న ఉగ్రవాదుల అడ్డా జఫైర్ హైట్స్‌పై దాడి చేసినప్పుడు తెహసీన్, వకాస్లు త్రుటిలో తప్పించుకున్నా.. పేల్చడానికి సిద్ధంగా ఉన్న 90 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో 50 వరకు మాగ్నెటిక్ పరిజ్ఞానంతో చేసినట్లు నిపుణులు నిర్ధారించారు.
ఇంధన రవాణాలే లక్ష్యంగా...
- ఇప్పటివరకు ఐఎం ఉగ్రవాదులు ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పరిజ్ఞానంతో తయారుచేసిన బాంబుల్నే వినియోగిస్తున్నారు. ప్రధానంగా పేలుడు పదార్థమైన అమ్మోనియం నైట్రేట్‌తో చేసే వీటిని విధ్వంసం సృష్టించాల్సిన ప్రదేశంలో పెట్టిన తరవాత టైమర్, డిజిటల్ వాచ్, సెల్‌ఫోన్ అలారమ్‌లను వినియోగించి నిర్ణీత సమయంలో పేలుస్తున్నారు.
- వీటికి మరింత ఆధునికత జోడించి మాగ్నెటిక్ పరిజ్ఞానాన్నీ అందుబాటులోకి తెచ్చింది ఐఎం. ఈ ఐఈడీలకు శక్తిమంతమైన అయస్కాంతాన్ని జోడించడం ద్వారా భారీ ఇనుప వస్తువుల్ని పట్టి ఉండేలా చేస్తారు.
- ఇలాంటి ఐఈడీలను కొన్ని రకాలైన యాసిడ్లతో పాటు పెట్రోల్, డీజిల్ వంటి త్వరతగతిన మండే, మంటల్ని త్వరగా విస్తరింపజేసే లక్షణం ఉన్న వాటిని రవాణా చేస్తున్న ట్యాంకర్లు, గూడ్స్ రైళ్లకు అతికించాలన్నది ఉగ్ర సంస్థ పన్నాగం.
- ఈ రకమైన ‘అతికించే బాంబులు’ అఫ్ఘానిస్థాన్, ఇరాక్‌ల్లో సుపరిచితమే అయినా... భారత్‌లో మాత్రం వీటి వినియోగం అరుదు.
- 2012 ఫిబ్రవరి 13న ఢిల్లీలోని ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం సమీపంలో ఇలాంటి బాంబుతో కూడిన కారే పేలింది. ఇది తక్కువ తీవ్రత కలిగింది కావడంతో నలుగురికి గాయాలయ్యాయి. అంతకు మించి అయస్కాంత పరిజ్ఞానం ఉన్న బాంబుల తయారీ, వినియోగానికి సంబంధించి పోలీసు విభాగాలకే పూర్తి అవగాహన లేదు.