
మనాలి-లేహ్ రోడ్డుపై మంచును తొలగిస్తున్న దృశ్యాలు
హిమాచల్‌ప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాగల 12 గంటల్లో వాతావరణం ప్రమాదకరంగా మారి విధ్వంసం జరిగే పరిస్థితులు కనబడుతున్నాయని తెలిపింది. వాతావరణంలో సంభవించే అనూహ్య మార్పులతో ప్రజా జీవనం స్తంభించే అవకాశముందని వెల్లడించింది. ఉరుములతో కూడిన గాలివానతో పాటు వడగండ్ల వర్షం పడుతుందని అంచనా వేసింది. మైదానాలతో పాటు కొండ ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. కాగా, రొహతాంగ్ పాస్ ప్రాంతంలో మనాలి-లేహ్ రోడ్డుపై భారీగా మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్ఓ) సిబ్బంది జేసీబీ సాయంతో రోడ్డుపై పేరుకు పోయిన మంచును తొలగించారు.
కేదార్‌నాథ్‌లో హిమపాతం
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం వద్ద శనివారం భారీగా హిమపాతం కురిసింది. ఆలయం పరిసరాల్లో పెద్ద మొత్తంలో మంచు పేరుకుపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా ఈనెల 9న కేదార్‌నాథ్ ఆలయాన్ని తెరవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.