
అన్నింటికీ సమాధానం యోగా
అంతర్జాతీయ యోగా ఉత్సవాలనుద్దేశించి మోదీ ప్రసంగం
రిషికేశ్: శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం ద్వారా శాంతిని సాధించే మార్గం యోగా అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. రిషికేశ్‌లో గంగానది ఒడ్డున జరుగుతున్న అంతర్జాతీయ యోగా ఉత్సవాలనుద్దేశించి గురువారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. యోగా అంటే ఎక్సర్‌సైజ్ కాదని, మనఃశరీరాలను ప్రకృతికి చేరువ చేసే మార్గమని స్వయంగా రోజూ యోగా సాధన చేసే ప్రధాని వివరించారు.
యోగా సాధనతో సమాజాన్ని చూసే దృక్పథం మారుతుందన్నారు. ‘అహం(నేను) నుంచి వయం(మనం) వైపు చేసే ప్రయాణమే యోగా’ అని వివరించారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా సవాలుగా మారిన నేపథ్యంలో యోగాసాధనం అత్యంత ఆవశ్యకంగా మారిందన్నారు. ఇస్రో ఇటీవల విజయవంతంగా నిర్వహించిన 104 ఉపగ్రహాల ప్రయోగాన్ని ప్రస్తావిస్తూ.. శాస్త్ర,సాంకేతిక రంగాల లోతులే కాకుండా, ఆత్మగత లోతులను పరిశోధించడంలో భారతీయులకు విశ్వాసం ఉందన్నారు.
అనాదిగా సాధువులు, మేధావులు శాంతి సాధన కోసం ఏకమై పరిశోధన చేసిన ప్రాంతంగా రిషికేశ్ ప్రఖ్యాతిని ప్రధాని గుర్తు చేశారు. అంతర్జాతీయ యోగా ఉత్సవాల నిర్వహణకు రిషికేశ్ సరైన స్థలమన్నారు. జీవితానికి సంబంధించిన అత్యంత క్లిష్ట సమస్యల పరిష్కారానికి ఆలోచనలు సాగించిన మేధావుల గడ్డగా భారత్‌ను అభివర్ణించిన జర్మన్ మేధావి మాక్స్ ముల్లర్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ ఉటంకించారు.