యోగి ఆదిత్యానాథ్ (ఫైల్ ఫోటో)
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అక్బర్ కంటే మహారాణా ప్రతాప్ చాలా గొప్ప చక్రవర్తి’ అని పేర్కొన్నారు. గురువారం లక్నో ఐఎమ్‌ఆర్‌టీలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి యోగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. ‘మహారాణా ప్రతాప్ గొప్పవీరుడు, శౌర్యవంతుడు. వేరేమతానికి చెందిన వాడైన విదేశీయుడు అక్బర్ చక్రవర్తిత్వాన్ని ఆయన ఒప్పుకోలేదు. అంతేకాక ఆ విషయాన్ని నేరుగా అక్బర్ రాయబారితోనే చెప్పగలిగాడు. మహారాణా ప్రతాప్ రాజ్యాన్ని కోల్పోయి దేశాలు పట్టుకుతిరిగినా తన ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోలేదు. అందుకే విదేశియుడైన అక్బర్‌ను చక్రవర్తిగా ఒప్పుకోలేదు. కానీ దురదృష్టం కొద్ది మన చరిత్రకారులు ఇలాంటి అంశాలను పట్టించుకోలేదు. ఫలితంగా ఒక తరం మొత్తం ఇలాంటి గొప్ప విషయాలు తెలుసుకునే అవకాశం కొల్పోయింది. మహారాణా ప్రతాప్ జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శదాయకం. ఆయన జీవితం నుంచి నేటి యువత శౌర్యం, ప్రతాపం వంటి లక్షణాలను అలవర్చుకోవా’లని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగి ‘యువశౌర్య’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో మహారాణా ప్రతాప్ జీవితం, ధైర్యసాహసాల గురించి వ్యాసాలు, కథలను పొందుపర్చారు.
గతంలోనూ...
ముస్లీం పాలకుల గురించి నోరు పారేసుకోవడం బీజేపీ నేతలకు ఇదే ప్రథమం కాదు. కొన్ని రోజుల క్రితం బల్లియా సురేంద్ర సింగ్ అనే ఒక బీజేపీ ఎమ్మేల్యే ప్రపంచ వింతల్లో ఒకటైన ‘తాజమహల్’ పేరును ‘రామ్ లేదా క్రిష్ణ మహల్ లేదా రాష్ట్ర భక్తి మహల్’గా మార్చాలన్నారు.
బీజేపీ నేతల వ్యాఖ్యల గురించి సమాజ్‌వారి పార్టీ నేత రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ.. ‘2019 ఎన్నికల నాటికి సమాజాన్ని మతం ప్రతిపాదికను చీల్చాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కానీ వారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. బీజేపీ, ఆ పార్టీ నేతలు ఎవరు కూడా చరిత్రను మార్చలేరు. అది తెలియకుండా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నార’ని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment