లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకావడం లేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో యూపీలోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేసి, కరోనాపై పోరు కొనసాగించేందుకు రాష్ట్రాన్ని వదిలి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు సీఎం యోగి తెలిపారు. ‘మా నాన్న మరణవార్త విని చాలా బాధ పడ్డా. విశ్వసనీయతతో నిస్వార్థంగా కష్టపడి పనిచేయాలని మా నాన్న ఎప్పుడు చెబుతుండేవారు. చివరి క్షణాల్లో ఆయన దగ్గర ఉండాలనుకున్నాను. కానీ 23 కోట్ల యూపీ ప్రజల బాధ్యతను దృష్టిలో పెట్టుకుని ఆయన దగ్గరకు వెళ్లలేకపోయాను. ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నాను. అంత్యక్రియల సందర్భంగా లాక్‌డౌన్ మార్గదర్శకాలను పాటించాలని మా అమ్మను, బంధువులను కోరుతున్నాను. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత నేను వస్తాను’ అంటూ సీఎం యోగి ఒక ప్రకటన విడుదల చేశారు.
యోగి తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ సోమవారం ఉదయం 10.44 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ కన్నుమూసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవనిశ్ కే అవస్థి వెల్లడించారు. ఆనంద్ సింగ్ భౌతికకాయానికి మంగళవారం ఉత్తరాఖండ్‌లోని సౌరి జిల్లాలోని స్వగగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరుకావొద్దని సీఎం యోగి కోరారు. ఆనంద్ సింగ్ బిస్త్ మృతి పట్ల యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా కూడా సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment