'రిపబ్లిక్ డే వేడుకల్లో మోదీని టార్గెట్ చేశారు'
న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం నాడు ఐసిస్ సహా పలు ఉగ్ర సంస్థలు ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు అందించిన రిపోర్ట్ కలకలం రేపుతోంది. టీనేజ్ పిల్లలను సాయుధులుగా మోదీ దగ్గరకు పంపేందుకు ఉగ్ర సంస్థలు కుట్ర పన్నుతున్నాయంటూ ఇంటలిజెన్స్ వర్గాలు భద్రతా దళాలను అప్రమత్తం చేశాయి. దీంతో భద్రతా దళాల నిఘా మరింత ఎక్కువైంది.
గత ఏడాది గణతంత్ర వేడుకల అనంతరం మోదీ ఎర్ర కోట వెలుపలకు వెళ్తున్న సమయంలో బయట వేచియున్న విద్యార్థులను గమనించి వారిని కలిసేందుకు తన చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని నిలువరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితినే కల్పించి.. 12-15 ఏళ్ల వయసున్న బాలురకు ఆయుధాలను, పేలుడు సామాగ్రిని ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇచ్చి మోదీ వద్దకు పంపేందుకు ఉగ్రవాదులు వ్యూహ రచన చేస్తున్నారని నిఘా వర్గాల నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్కు అలర్ట్ అందింది. దీంతో మోదీకి మరింత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
పలు ఉగ్ర సంస్థలు మెషీన్ గన్ల వాడకంలో పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నాయి. పసి పిల్లలను తమ ఆపరేన్లలో ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. ఇండియాలో ఐసిస్ బలపడేందుకు 'అన్సార్-ఉద్-తాహిద్-తాహిద్' అనే ఉగ్ర సంస్థ సహకరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రత బలగాలు ఢిల్లీలో అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాగా జనవరి 25న ప్రధాని మోదీ.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తో కలిసి గుర్‌గావ్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గుర్‌గావ్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో నేరాల పరిస్థితిపై తమకు నివేదిక ఇవ్వాల్సిందిగా అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఎ) శుక్రవారం హర్యానా పోలీసులను కోరింది. సోమవారం నేతలిద్దరు గుర్‌గావ్లో జాతీయ సౌర ఇంధన సంస్థలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఫ్రాన్స్ అమెరికా మిత్ర దేశమైనందున హోలాండ్ పర్యటనకు భద్రతా చర్యలను సిఐఎ చేపడుతోంది.