హోదా వచ్చే వరకు వదిలిపెట్టం: వైఎస్ జగన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం వదిలి పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని వైఎస్ జగన్, వైఎస్సార్ సీపీ ఎంపీలు కలిశారు.
ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా హామీ అమలు చేయకుంటే పార్లమెంట్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు పోరాటం చేస్తూనే, మరోవైపు ఇతర పార్టీలను కలుపుకుని పార్లమెంట్ లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం వదిలిపెట్టబోమని ఘంటాపదంగా చెప్పారు.
వైఎస్ జగన్ తో పాటు సీతారాం ఏచూరిని కలిసిన వారిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక, వైఎస్ అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులున్నారు.