
లోక్‌సభలో మార్మోగిన సమైక్య గళం
సభలో సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించిన జగన్, మేకపాటి, ఎస్పీవై
వాయిదా తీర్మానంపై చర్చ కోసం గట్టిగా పట్టు
సాక్షి, న్యూఢిల్లీ: సమైక్యాంధ్రప్రదేశ్ డిమాండ్‌తో రోజూ లోక్‌సభలో ఆందోళన చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం కూడా ఉధృతంగా నిరసనలు కొనసాగించింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి బుధవారం లోక్‌సభలో సమైక్యవాదం వినిపిస్తూ ముక్తకంఠంతో నినదించారు. ‘సేవ్ డెమొక్రసీ ఇన్ ఆంధ్రప్రదేశ్’(ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి), ‘కీప్ ఆంధ్రప్రదేశ్ యునెటైడ్’(ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచండి), ‘వీ వాంట్ జస్టిస్’(మాకు న్యాయం చేయండి) అంటూ వారు ఉధృతంగా నినాదాలు చేశారు. మేకపాటి, ఎస్పీవై ప్లకార్డులను ప్రదర్శించారు.
వాయిదా తీర్మానంపై చర్చకు ఒత్తిడి..
బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభానికి ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌కు రెండు నోటీసులిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై చర్చించాలంటూ వాయిదా తీర్మానానికి నోటీసిచ్చింది. కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ నోటీసునివ్వడంతో, వారికి మద్దతునివ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని, ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని యావత్ దేశ ప్రజానీకానికి, అలాగే రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే సంకల్పంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్, మేకపాటి అవిశ్వాసానికి నోటీసునిచ్చారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టడానికి ఉపక్రమించారు.
ఈ తరుణంలోనే జగన్, మేకపాటి, ఎస్పీవై పోడియం వద్దకు వెళ్లారు. మరోవైపు కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు సబ్బం హరి, లగడపాటి, ఉండవల్లి తదితరులు, టీడీపీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొనకళ్ల నారాయణరావు ప్రభృతులు కూడా వెల్‌లోకి దూసుకెళ్లారు. వాయిదా తీర్మానానికి తామిచ్చిన నోటీసును చేపట్టాలంటూ జగన్, మేకపాటి, ఎస్పీవై స్పీకర్ మీరాకుమార్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. అటు కాంగ్రెస్, టీడీపీ సభ్యులు షరామామూలుగా వెల్‌లో తమ నినాదాలను సాగించారు. మరికొందరు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. ఇదే తరుణంలో ఇతర పార్టీల సభ్యులు కూడా వేరే సమస్యలపై ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడం, నినాదాలతో సభ దద్దరిల్లుతుండటం గమనించిన స్పీకర్ 11.04కు సభను 12 వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన కాసేపటికి ఉదయం పరిస్థితులే పునరావృతమయ్యాయి. జగన్, మేకపాటి, ఎస్పీవైతోపాటు కాంగ్రెస్, టీడీపీ సభ్యులతోపాటు ఇతర పార్టీల సభ్యులు వేరే అంశాలపై పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది.
నినాదాల మధ్యే అవిశ్వాస నోటీసుల ప్రస్తావన
లోక్‌పాల్ బిల్లుకున్న ప్రాధాన్యం దృష్ట్యా ముందుగా దానిపై చర్చించి ఆమోదించిన తర్వాత అవిశ్వాస నోటీసులను చేపట్టాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ కోరగా, స్పీకర్ మాత్రం బిల్లుకు ముందే అవిశ్వాస నోటీసుల్ని ప్రస్తావించారు. సభలో నినాదాలు ప్రతిధ్వనిస్తుండగానే స్పీకర్ అవిశ్వాస నోటీసులను ప్రస్తావించారు. ఈ సమయంలో కాంగ్రెస్ సీమాంధ్ర సభ్యులకు పోటీగా కొందరు తెలంగాణ ఎంపీలు కూడా పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో ఆమె, ‘సభలో సాధారణ పరిస్థితులు లేనందున ఈ నోటీసులను నేను చేపట్టలేకపోతున్నాను’ అని ప్రకటించి లోక్‌పాల్ బిల్లును పెట్టాల్సిందిగా న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్‌ని కోరారు. నినాదాల మధ్యే చర్చ, ఆపై లోక్‌పాల్ బిల్లుకు సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. తర్వాత స్పీకర్ మీరాకుమార్... అమెరికాలో దౌత్య అధికారిణికి జరిగిన అవమానంపై చర్చకు అనుమతించారు. ఇది పూర్తయ్యే సరికి 1.18 గంటలైంది. అప్పటివరకూ పలు పార్టీల సభ్యుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో స్పీకర్, జాతీయ గీతం మొదలు కానుందని, సభ్యులందరూ తమ స్థానాలకు తిరిగివెళ్లాలని పదే పదే కోరారు. దీంతో సభ్యులు తమ స్థానాలకు చేరుకున్నారు. ఆ వెంటనే జాతీయ గీతం ఆలాపన జరగడం, అదైన వెంటనే స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం రెండు నిమిషాల్లో పూర్తయింది. అటు రాజ్యసభ కూడా వాయిదాల పర్వంతో సాగి ప్రభుత్వానికి అవసరమైన బిల్లులను ఆమోదించాక నిరవధికంగా వాయిదాపడింది.
హైదరాబాద్‌కు పయనమైన జగన్: పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన జగన్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు పయనమయ్యారు. సమావేశాలు ముందుగానే ముగియడంతో ఆయన తిరిగి రాష్ట్రానికి వెళ్లిపోయారు.అభాసుపాలైన టీడీపీ ఎంపీలు: టీడీపీ ఎంపీలు లోక్‌సభలో అభాసుపాలయ్యారు. సమైక్యాంధ్రపై వారి ద్వంద్వ వైఖరే దీనికి కారణం. బుధవారం లోక్‌సభలో సమైక్యాంధ్ర అంటూ కొందరు టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతనామా నాగేశ్వరరావు సభలో.. దేవయాని అంశంపై చర్చలో పాల్గొన్నారు. ఒకే పార్టీకి చెందిన ఎంపీలు, ఆ పార్టీ పార్లమెంటరీ నేత ఇలా ద్వంద్వ విధానాలు అవలంబించడం చూసి మిగతా పార్టీల నేతలు నవ్వుకున్నారు.