ఢిల్లీ చేరుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న అప్రజాస్వామిక తీరును జాతీయస్థాయిలో ఎలుగెత్తి చాటడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘సేవ్ డెమొక్రసీ’(ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) అని నినదిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. అవినీతి సొమ్ముతో రాష్ట్రంలో చంద్రబాబు విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును, నిరంకుశంగా పరిపాలన సాగిస్తున్న తీరును వివిధ జాతీయ పార్టీల నేతలను కలుసుకుని వివరిస్తారు.
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసిస్తూ చంద్రబాబు స్వయంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాను కప్పుతున్న వైనాన్ని కూడా దేశం దృష్టిని ఆకర్షించేలా తెలియజేయబోతున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలవాలని కూడా నిర్ణయించారు. వారిచ్చే సమయాన్ని బట్టి ఈ మూడు రోజుల్లో కలసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తారు.