ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టోను హత్య చేయడంలో ఆమె భర్త ఆసిఫ్ ఆలీ జర్దారీ ప్రమేయం ఉందని మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ స్పష్టం చేశారు. భుట్టో హత్య, అప్పటి పరిస్థితులు, జర్దారీ పాత్రను వివరిస్తూ.. ముషారఫ్ ఒక వీడియోను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
బేనజీర్, ముర్తాజా భుట్టోల హత్యలో ఆసిఫ్ ఆలీ జర్దారీ పాత్ర ఉందని ముషారఫ్ అందులో స్పష్టం చేశారు. జర్దారీతో భుట్టో తనయులు.. సింధ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బేనజీర్ హత్యతో వాస్తవంగా ఎవరు లాభం పొందారు? ఆ హత్య తరువాత నేను అన్నీ కోల్పోయాను.. పదవి, అధికారం సహా.. చిట్ట చివరకు దేశాంతరం వెళ్లాల్సివచ్చింది. కానీ.. ఆ హత్యతోనే జర్దారీ దేశాధ్యక్షుడు అయ్యారు. సహజంగానే లాభం పొందిన వాళ్లు.. ఆ హత్యను నాపై రుద్దారు.. అని ముషారఫ్ పేర్కొన్నారు.