ప్రత్యేక రాష్ర్టం కావాలని కోరుతూ మహారాష్ట్రలో విదర్భ వాసుల చేపట్టిన ఉద్యమం మరో ముందడుగు వేసింది. ప్రత్యేక రాష్టంపై అమరావతి జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. చికాల్దరాలో శనివారం జరిగిన జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం ముందుకు ఈ తీర్మానాన్ని తీసుకువెళ్లగా, ఏకగ్రీవ ఆమోదం లభించింది. పలుచోట్ల ప్రత్యేక రాష్ట్ర సెగలు ఊపందుకున్న నేపథ్యంలో విదర్భను ప్రత్యేక రాష్ర్టంగా ప్రకటించాలంటూ వారు జిల్లా స్టాండింగ్ కమిటీకి నివేదించారు.
జిల్లా పరిషత్ సభ్యుల్లో ఒకరైన అభ్యంకర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సురేఖకు విదర్భ ప్రత్యేక తీర్మానాన్నినివేదించారు. ప్రత్యేక రాష్ర్టం రాదనే భయంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. సహజ సిద్ధమైన వనరులున్న తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ నివేదికలో డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణకు కేంద్రం అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తరుణంలో పలుచోట్ల రాష్ట్ర డిమాండ్‌లు ఊపందుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు విదర్భ విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానిక కాంగ్రెస్ ఎంపీ విలాస్ ముత్తేమ్వర్ విమర్శించారు. తెలంగాణ కంటే విదర్భ సమస్య పురాతనమైందన్న విషయాన్ని షిండే మరిచారా అంటూ ప్రశ్నించారు.