ఆత్మహత్యకు పాల్పడిన జాన్సన్(ఫైల్)
మోర్తాడ్(బాల్కొండ) : నవ మాసాలు తన మాతృ గర్భంలో పెరిగిన శిశువు ఈ రోజే బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అప్పుడే పుట్టిన చిన్నారి ఇంకా కనుపాపను తెరువలేదు. ఆడ పిల్ల జన్మించడంతో తమ ఇంటికి మహాలక్ష్మి నడచి వచ్చిందనే సంతోషించాలో లేక ఆ చిన్నారి తండ్రి అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినందుకు దుఃఖించాలో తెలియని అయోమయ పరిస్థితి ఆ కుటుంబానిది. బుధవారం సాయంత్రం గుమ్మిర్యాల్, తాళ్లరాంపూర్‌ల మధ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వడ్లూరి జాన్సన్(30) మృత దేహానికి గురువారం ఆర్మూర్‌లోని ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతుంది. అదే సమయంలో జాన్సన్ భార్య సలోనికి పురిటి నొప్పులు ఆగిపోవడంతో ఆర్మూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ప్రసవం చేశారు.
జాన్సన్ మృత దేహానికి ఒక వైపు పోస్టుమార్టం జరుగుతుండగానే మరో వైపు ఆపరేషన్ ద్వారా అతని భార్యకు వైద్యులు ప్రసవం చేశారు. ఒకే రోజు ఒకే సమయంలో ఒకే పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఎవరికి ఏమి వివరించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గల్ఫ్ మోసాలతో విసిగిపోయిన జాన్సన్ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని ఆయన భార్య సలోనికి తెలిపే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. జాన్సన్ మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృత దేహాన్ని ఆర్మూర్ నుంచి గుమ్మిర్యాల్‌కు తరలించి ఖననం చేశారు. జాన్సన్ భార్య సలోనికి ఆపరేషన్ చేయడంతో ఆమెకు ఈ విషయం వివరించకుండా జాన్సన్ వస్తాడనే నమ్మకాన్ని కలిగిస్తూనే ఉన్నారు. జాన్సన్ ఆత్మహత్య కారణంగా రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment