postmortum
-
త్రినాథ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
విశాఖపట్నం: ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణం చేసిన త్రినాథ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. మరికాసేపట్లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి త్రినాథ్ భౌతికకాయాన్ని రాజమండ్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసుపత్రి వద్ద త్రినాథ్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు గొల్లబాబూరావు, సీపీఎం నాయకులు అప్పల రాజు పరామర్శించారు. గొల్లబాబూ రావు మాట్లాడుతూ..త్రినాథ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమను ఆదేశించారని తెలిపారు. త్రినాథ్ కుటుంబాన్ని ఆదుకుంటామని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. అప్పల రాజు మాట్లాడుతూ..ప్రభుత్వం కూడా త్రినాథ్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్రినాథ్ బంధువు నూకరాజు మాట్లాడుతూ..ప్రత్యేక హోదా కోసం అందరూ కలసి చిత్తశుద్ధిగా పోరాడాలని కోరారు. -
ఖననం చేసిన మృతశిశువుకు పోస్టుమార్టం
నర్సింహులపేట : ఖననం చేసిన శిశువు మృతదేహాన్ని నాలుగు రోజుల తర్వాత వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగు శివారు బంజరలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, బయ్యారం ఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. బంజర గ్రామానికి చెందిన గంగరబోయిన సరిత మానసిక స్థితి సరిగా లేక తన చేతిలో ఉన్న శిశువును బయ్యారం పాకాల వాగు బ్రిడ్డి పై నుంచి పడేయడంతో శిశువు మృతిచెందిన సంఘటన తెలిసిదే. అయితే బంధువుల ఫిర్యాదు మేరకు సంఘటనపై గత గురువారం రాత్రి బయ్యారం పీఎస్‌లో కేసు నమోదు చేశారు. కాగా కుటుంబసభ్యులు ఎవరికీ చెప్పకుండా శిశువు మృతదేహాన్ని ఖననం చేయగా, పంచనామా, పోస్టుమార్టం నిమిత్తం మరలా వెలికితీశారు. సోమవారం బయ్యారం తహసీల్దార్ పుల్లారావు సమక్షంలో ఎస్సైలు రవీందర్, సంతోస్రావు.. బంజరలో పూడ్చిన శిశువు మృతదేహాన్ని వెలికితీసి పంచనామా చేశారు. అలాగే మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రి వైద్యుడు సందీప్ అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బాలుడి మృత దేహాన్ని కుటుంబసభులకు అప్పగించగా మరలా ఖననం చేశారు. పూడ్చివేసిన బాలుడిని వెలిసితీసి పోస్టుమార్టం చేస్తుండగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
తండ్రి,కొడుకుల దారుణహత్య
సాక్షి, ఇల్లంతకుంట (మానకొండూర్) : భూ వివాదం తండ్రీకొడుకుల దారుణహత్యకు దారితీసింది. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టారావుపల్లి గ్రామ శివారులోని సర్వేనంబర్ 540లో ఉన్న 39గుంటల వ్యవసాయభూమి కిష్టారావుపల్లి గ్రామానికి చెందిన మామిండ్ల దేవయ్య అతడి సోదరుడు మామిండ్ల స్వామి పేర్లతో భూ రికార్డుల్లో ఉండగా, కాస్తులో కందికట్కూర్‌కు చెందిన సావనపెల్లి ఎల్లయ్య ఉన్నాడు. భూమి మాదంటే.. మాదంటూ వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఇదే భూమిలో సోమవారం మామిండ్ల స్వామి, దేవయ్య విత్తనాలు వేశారు. మంగళవారం వేకువజామున సావనపెల్లి ఎల్లయ్య, అతడి కుమారుడు శేఖర్ వెళ్లి అదే వ్యవసాయ భూమిలో ట్రాక్టర్‌తో దుక్కిదున్నడం మొదలుపెట్టారు. సమీపంలోనే ఉన్న మామిండ్ల దేవయ్య, స్వామి, దేవయ్య భార్య పద్మ, కుమారుడు వెంకటేశ్ వ్యవసాయ భూమి వద్దకు చేరుకున్నారు. కారం చల్లి.. గొడ్డళ్లతో నరికి.. సావనపెల్లి ఎల్లయ్య(50), అతడి కుమారుడు శేఖర్(21)లపై మామిండ్ల దేవయ్య భార్య పద్మ కారంపొడి చల్లింది. దేవయ్య, అతడి సోదరుడు స్వామి గొడ్డళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. అక్కడే ఉన్న ఎల్లయ్య భార్య ఎల్లవ్వ కేకలు వస్తూ మృతదేహాల వద్దకు వచ్చేలోపే నిందితులు పారిపోయారని ఎల్లవ్వ తెలిపింది. పరిశీలించిన ఎస్పీ.. విషయం తెలుసుకున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే, డీఎస్పీ వెంటరమణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పథకం ప్రకారమే హత్యలు జరిగాయని, కొన్నేళ్లుగా భూవివాదం కేసు కోర్టులో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే మూడు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. తండ్రీకొడుల హత్యకేసులో నలుగురి పాత్ర ఉందని, నింధితు లు పరారీలో ఉన్నట్లు వివరించారు. మృతుడి భార్య ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మృతదేహాలు తరలించొద్దంటూ బంధువుల ఆందోళన.. హత్య ఘటనలో నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించే వరకు మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి తరలించొద్దంటూ బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహాలను తరలించేందుకు తీసుకొచ్చిన ట్రాక్టర్ ఎదుట బైటాయించారు. డీఎస్పీ వెంకటరమణ, సీఐలు అనిల్‌కుమార్, రవీందర్‌లు వచ్చి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ 39 గుంటల భూమి మృతుల కుటుంబానికే చెందేలా చూస్తామని హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. భూవివాదం కోర్టులో ఉందని, కోర్టు చూసుకుంటుందని చెప్పడంతో శాంతించారు. పోలీసుల అదుపులో నిందితులు హత్యకేసులో నిందితులైన మామిండ్ల దేవయ్య, మామిండ్ల స్వామి, పద్మ, వెంకటేశ్ ఇల్లంతకుంట పోలీసుస్టేషన్‌కు వెళ్లి అక్కడి నుంచి సిరిసిల్ల సీఐ కార్యాలయంలో లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు మాత్రం నిందితులు పరారీలోనే ఉన్నారని చెబుతున్నారు. -
అక్కడ పోస్టుమార్టం..ఇక్కడ పాప జననం
మోర్తాడ్(బాల్కొండ) : నవ మాసాలు తన మాతృ గర్భంలో పెరిగిన శిశువు ఈ రోజే బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అప్పుడే పుట్టిన చిన్నారి ఇంకా కనుపాపను తెరువలేదు. ఆడ పిల్ల జన్మించడంతో తమ ఇంటికి మహాలక్ష్మి నడచి వచ్చిందనే సంతోషించాలో లేక ఆ చిన్నారి తండ్రి అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినందుకు దుఃఖించాలో తెలియని అయోమయ పరిస్థితి ఆ కుటుంబానిది. బుధవారం సాయంత్రం గుమ్మిర్యాల్, తాళ్లరాంపూర్ల మధ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వడ్లూరి జాన్సన్(30) మృత దేహానికి గురువారం ఆర్మూర్‌లోని ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతుంది. అదే సమయంలో జాన్సన్ భార్య సలోనికి పురిటి నొప్పులు ఆగిపోవడంతో ఆర్మూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. జాన్సన్ మృత దేహానికి ఒక వైపు పోస్టుమార్టం జరుగుతుండగానే మరో వైపు ఆపరేషన్ ద్వారా అతని భార్యకు వైద్యులు ప్రసవం చేశారు. ఒకే రోజు ఒకే సమయంలో ఒకే పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఎవరికి ఏమి వివరించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గల్ఫ్ మోసాలతో విసిగిపోయిన జాన్సన్ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని ఆయన భార్య సలోనికి తెలిపే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. జాన్సన్ మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృత దేహాన్ని ఆర్మూర్ నుంచి గుమ్మిర్యాల్‌కు తరలించి ఖననం చేశారు. జాన్సన్ భార్య సలోనికి ఆపరేషన్ చేయడంతో ఆమెకు ఈ విషయం వివరించకుండా జాన్సన్ వస్తాడనే నమ్మకాన్ని కలిగిస్తూనే ఉన్నారు. జాన్సన్ ఆత్మహత్య కారణంగా రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. -
అధికారులకు షాకిచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాకూర్ బస్తీ అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారంలో రైల్వే, రెవెన్యూ శాఖ అధికారులకు చుక్కెదురైంది. ఢిల్లీ సంజయగాంధీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక అధికారులకు, ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. తీవ్ర గాయాల వల్లే చిన్నారి మరణించిందని పోస్ట్‌మార్టం నివేదిక తేల్చి చెప్పింది. దీంతో కూల్చివేతలకు, చిన్నారి మరణానికి సంబంధం లేదని ప్రకటించిన మంత్రివర్యులు, రైల్వేశాఖ అధికారులు ఇరకాటంలో పడ్డారు. షాకూర్ బస్తీ కూల్చివేతల్లో మరణించిన చిన్నారి మృతదేహానికి మంగళవారం పోస్ట్‌మార్టం పూర్తయింది. సంజయ్ గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుల వైద్య బృందం తన నివేదికను సమర్పించింది. చిన్నారి తలకు బలమైన గాయమైందని అలాగే రెండు నుండి నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయని తెలిపింది. తీవ్ర రక్తస్రావం జరిగినట్టుగా తమ పరీక్షలో తేలిందని, పాప చనిపోయి సుమారు 30 గంటలు అవుతుందని తన నివేదికలో పేర్కొంది. ఛాతీ, తలపైన తీవ్ర గాయాలు, రక్తస్రావం, షాక్ వల్ల పాప చనిపోయివుండవచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు కూడా సీరియస్‌గా స్పందించింది. గడ్డకట్టుకు కుపోయే చలిలో పేదల ఆవాసాలను కూల్చడం అన్యాయమని న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ వ్యవహారంలో అధికారులందరూ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. జాతీయ మావనహక్కులు సంఘం ఢిల్లీ ప్రభుత్వానికి, రైల్వే బోర్టుకు నోటీసులు జారీ చేసింది. కాగా ఢిల్లీలో ప్రతిపాదిత రైల్వే టెర్మినల్ నిర్మాణ ప్రాంతంలో గత శనివారం అర్థరాత్రి అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారం, చిన్నారి మరణం ఒక్కసారిగా ఉద్రిక్తతను రేకెత్తించిన విషయం తెలిసిందే.