ధనిక, పేద తేడాలు వద్దు | DGP Mahender Reddy Review Meeting with Police Officers | Sakshi
Sakshi News home page

ధనిక, పేద తేడాలు వద్దు

Published Sat, Jan 20 2018 9:50 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM

DGP Mahender Reddy Review Meeting with Police Officers - Sakshi

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌ అర్బన్‌): ధనికులు, పేదలు అని తేడా చూపకుండా న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేవారందరికీ గౌరవ మర్యాదలు ఇవ్వాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి జిల్లా పోలీసులకు సూచించారు. ఇది పక్కగా అమలైతేనే పోలీసులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. రాష్ట్ర పోలీస్‌శాఖ ప్రవేశపెడుతున్న సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. శుక్రవారం హెలిక్యాప్టర్‌లో జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ముందుగా డీపీఓలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ జిల్లాలోని 33 పోలీస్‌స్టేషన్లలో ఒకే రకమైన పౌర సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
 
జిల్లాలో నేరాల నియంత్రణకు టెక్నాలజీని బాగా వాడుతున్నారని, రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని కితాబిచ్చారు. ఇదంతా ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం ఏర్పాటు చేసుకోవటంతోనే సాధ్యమైందని, దీనిని ఇలాగే కొనసాగించాలని సూచించారు.  సీసీ కెమోరాలతో ఉపయోగం ఎంతోఉందని, జిల్లా కేంద్రంతో పాటు, జిల్లాలోని ముఖ్యపట్టణాలలో మరికొన్ని సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తాను ఈ జిల్లాలో ఎస్పీగా పనిచేసిన రోజులను గుర్తు చేశారు. పోలీస్‌శాఖలో ఖాళీలు, మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందిస్తున్న పౌర సేవలు, శాంతిభద్రతల నిర్వహణ వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ కార్తికేయ 2017 సంవత్సరంలో జిల్లాలో పోలీస్‌శాఖ పనితీరు, అచీవ్‌మెంట్‌ను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పోలీసు సేవలను మెరుగు పరుస్తామని అన్నారు. పోలీసుశాఖ పని పద్ధతుల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడతామని, ఉద్యోగుల్లో నైపుణ్యతను పెంచే కార్యక్రమాలు చేపడతామన్నారు. రాత్రీపగలు  తేడా లేకుండా పొలీసు సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. డీపీజీ వచ్చిన హెలికాప్టర్‌ పాలిటెక్నిల్‌ మైదానంలో ల్యాండ్‌ అయ్యింది. డీజీపీ వెంట హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర వచ్చారు. వీరికి నిజామాబాద్‌ రేంజ్‌ డీఐజీ ఎన్‌ శివశంకర్‌రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, డిచ్‌పల్లి బెటాలియన్‌ కమాండెంట్‌ ఎన్‌వీ సాంబయ్య, డీసీపీలు శ్రీధర్‌రెడ్డి, ఆకుల రాంరెడ్డి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుండి డీజీపీ నేరుగా పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయానికి చేరుకోగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్‌ ఏసీపీలు సుదర్శన్, శివకుమార్, రఘు, ఎన్‌ఐబీ ఏసీపీ రవీందర్‌లు స్వాగతం పలికారు. డీజీపీ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. డీజీపీ పోలీస్‌ కార్యాలయంలోని సీసీ టీవీ కంట్రోల్‌ రూంను సందర్శించి, వాటి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌రావు, ఎస్‌బీ సీఐ వెంకన్న, జిల్లాలోని అన్ని సర్కిళ్ల ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement