‘ఐపీ’తో టోపీ | IP tension to kamareddy businessman | Sakshi
Sakshi News home page

‘ఐపీ’తో టోపీ

Published Fri, Jan 12 2018 1:15 PM | Last Updated on Fri, Jan 12 2018 1:15 PM

IP tension to kamareddy businessman

చిట్టీల పేరుతో జనం నుంచి డబ్బులు వసూలు చేయడం.. విచ్చలవిడిగా అప్పులు చేయడం.. ఇలా సేకరించిన సొమ్ముతో ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాలు చేయడం.. అదను చూసి ‘ఐపీ’ పెట్టేసి భాగస్వాములు, ప్రజల నెత్తిన టోపీ పెట్టేయడం.. ఇలాంటి ఘటనలు కామారెడ్డిలో తరచూ వెలుగు చూస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన ‘రక్షణ’.. కొందరికి ఆయుధంగా మారింది. భాగస్వాములు, జనాల నమ్మకమే పెట్టుబడిగా భారీగా కూడబెట్టుకొని, ఆ తర్వాత దివాళా తీశామని కోర్టు తలుపు తట్టడం షరా మామూలుగానే మారింది.  
 

సాక్షి, కామారెడ్డి: ఐపీ.. ఈ పదం వింటేనే కామారెడ్డి వ్యాపారుల్లో ఇప్పుడు వణుకు పుడుతోంది. చిట్టీలు వేసిన వారి గుండెల్లో దడ పుట్టిస్తోంది. చిన్నా చితకా పొదుపు చేసిన సొమ్మును ఫైనాన్సుల్లో చిట్టీలు, పెట్టుబడుల రూపంలో పెట్టిన వారిలో కలకలం రేపుతోంది. దివాళా పేరిట టోకరా వేస్తూ కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపుతుండడంతో మార్కెట్‌లో తీవ్ర అయోమయం, గందరగోళం నెలకొంది. గత రెండేళ్ల కాలంలో జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో ఎనిమిది మంది ఐపీ బాట పట్టి, నమ్మిన వారికి సుమారు రూ. 20 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారు. 2016లో నలుగురు, 2017లో ముగ్గురు, ఈ సంవత్సరం ఆరంభంలోనే ఒకరు ఐపీ బాట పట్టారు. నాలుగైదు జిల్లాలకు కూడలిగా, వ్యాపార వాణిజ్య కేంద్రంగా పేరున్న కామారెడ్డి పట్టణంలో ఇప్పుడు ఎక్కడికెళ్లినా ‘ఐపీ’ల ముచ్చట్టే వినిపిస్తున్నాయి. నమ్మి నిండా మునిగిన వారు ఇప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో తెలిసిన వారినల్లా కలుస్తూ తమ బాధను చెప్పుకుంటున్నారు. మోసపోయిన వారికి అసలు ఐపీ అంటే ఏమిటి? దాని పర్యవసానాలు ఏమిటి? అన్న దానిపై అవగాహన లేకపోవడంతో ఐపీ పెట్టాడని తెలిస్తేనే హడలి పోతున్నారు. నోటీసులు అందుకున్న వారు డబ్బులు పోవడం ఏమో గాని ఎలా వ్యవహరించాలో తెలియక అయోమయానికి, ఆందోళనకు గురవుతున్నారు. 

ఎందుకు పెడుతున్నారు..? 
చిట్టీలు, ఫైనాన్స్‌ రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్న వ్యాపారులు కొందరు ఇష్టారీతిన డబ్బును సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. మరికొందరు ‘రియల్‌’ వ్యాపారంలో పెట్టి బురిడీ కొడుతుంటే, ఇంకొందరేమో ఆస్తులను కూడబెట్టుకొంటున్నారు. ఇంకొందరు అధిక వడ్డీలు చెల్లించడం ద్వారా నష్టపోతున్నారు. అయితే, నష్టాలను కప్పిపెడుతూ నమ్మిన వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకుంటున్నారు. చివరకు ఆస్తులను ఇతరుల పేరిట మార్చడం, అమ్ముకోవడం ద్వారా వచ్చిన సొమ్మును దాచుకుని ఐపీ బాట పడుతున్నారు. అయితే, ఈ పిటిషన్లు దాఖలయినప్పుడు కోర్టుకు వచ్చి న్యాయ æపోరాటం చేసే వ్యాపారులు తక్కువగా ఉండడంతో వంచకుల ఆటలు సాగుతున్నాయి. కొందరు నమ్మిన వారికి టోపీ పెట్టడానికి ముందస్తు ప్రణాళికతో ఐపీ ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే, బడా వ్యాపారులు ఐపీ జాబితాలో ఉన్నపుడు వారి వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా లోలోపల సెటిల్‌మెంట్లు చేసుకుని, చిన్న పెట్టుబడిదారులను నిండా ముంచుతున్నారు. 

‘టోపీ’ పెడితే ఏం చేయాలి..? 
మన వద్ద సొమ్ము తీసుకున్న వారెవరైన ఇన్‌సాల్వెన్సీ పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు మన వద్ద ఉన్న డాక్యుమెంట్లు, ప్రామీసరీ నోట్‌లు, చెక్‌ల ద్వారా కోర్టులో కేసు నమోదు చేసి, కోర్టు డిక్రీ తీసుకునే అవకాశం ఉంది. ఇలా డిక్రీ తీసుకుంటే దాని విలువ 12 ఏళ్ల వరకు ఉంటుంది. ఐపీ పెట్టిన వ్యక్తి తిరిగి వ్యాపారంలో పుంజుకుంటే అతని వద్ద నుంచి డబ్బు తిరిగి రాబట్టుకునే అవకాశం ఈ డిక్రీ కల్పిస్తుంది. అయితే, చాలా సందర్బాల్లో ఐపీ పిటిషన్‌ దాఖలు కాగానే రుణదాతలు మిన్నకుండి పోతున్నారు. మరికొందరు పెద్ద మొత్తంలో సొమ్ములు ఇచ్చాం.. ఇన్‌కం ట్యాక్స్‌ బాధలుంటాయని భయపడి ఐపీ పెట్టిన వారితో రాజీ కుదుర్చుకుంటున్నారు. చాలా సందర్చాల్లో రుణ దాతల వద్ద అప్పు ఇచ్చినట్టు ఎటువంటి డాక్యుమెంట్స్‌ ఉండడం లేదు. అయితే, ‘నష్టపోయిన’ వ్యాపారులు రుణ దాతల పేర్లను ఐపీ కేసులో చూపుతున్నందువల్ల దాని ఆధారంగా రుణ వసూలు చేసుకోవడానికి దావా వేసే అవకాశాలు ఉన్నట్టు న్యాయవాదులు చెబుతున్నారు. 

రాజీ నాటకం.. 
ఐపీని అడ్డం పెట్టుకుని కొందరు రాజీ పేరిట సగానికి పైగా సొమ్ము ఎగ్గొంట్టేందుకు స్కెచ్‌ వేస్తున్నారు. ఇటీవల ఐపీ పెట్టిన ఓ వ్యాపారి తాను ఇవ్వాల్సిన వారి పేర్లను ఇన్‌సాల్వెన్సీ పిటిషన్‌లో చేర్చకుండా బినామీ పేర్లు చేర్చినట్టు సమాచారం. అసలు అప్పు ఇచ్చిన వారికి మాత్రం ‘మీ పేర్లు ఐపీలో లేవు.. మీతో ఎంతో కొంతకు సెటిల్‌మెంట్‌ చేసుకుంటానంటూ’ నమ్మబలుకుతున్నట్టు తెలుస్తోంది.  

ఐపీ అంటే..

ఐపీ అంటే ఇన్‌సాల్వెన్సీ పిటీషన్‌. వ్యాపారంలో నష్టాలు వచ్చినపుడు రుణ గ్రహీతలను రక్షించడానికి తయారు చేసిన చట్టమిది. నష్టాల బారిన పడిన వ్యకి తాను దివాళా తీసినట్టు ప్రకటించమని కోర్టును ఆశ్రయించి, తనకున్న అప్పులు, ఆస్తుల జాబితాను సమర్పించి, నష్టాలకు కారణాలను వివరించి కోర్టునుంచి రక్షణ పొందే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తోంది. అయితే, ఈ రక్షణ ప్రస్తుతం మోసగాళ్లకు వరంగా మారింది. ఐపీని అస్త్రంగా చేసుకుని ‘కొందరు’ నమ్మిన వారికి టోపీ పెడుతున్నారు. అయితే, ఈ చట్టం అప్పులు తీసుకున్న వారికే కాదు, ఇచ్చిన వారికి సైతం రక్షణ కల్పిస్తోంది. రుణ గ్రహీత నుంచి తమకు రావాల్సిన రొక్కం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కోర్టును ఆశ్రయించి సదరు వ్యక్తిని దివాళాకోరుగా ప్రకటించమనే అవకాశం చట్టం కల్పిస్తోంది. దివాళా పిటిషన్‌ దాఖలా చేసిన వ్యక్తి ఆస్తులను, అప్పులను ఇతర సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం కోర్టు సదరు వ్యక్తి దివాళా తీసినట్టు ప్రకటిస్తుంది. అయితే, దివాళా పిటిషన్లు దాఖలు అవుతున్నప్పటికీ కోర్టు విచారణ పూర్తయి దివాళా తీసినట్టు ప్రకటించిన కేసులు చాలా చాలా తక్కువే.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement