
కామారెడ్డి డిగ్రీ కళాశాల స్థలంపై కబ్జాకోరుల కన్ను పడింది. కోట్ల విలువచేసే ఆ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవడానికి పథకం పన్నారు. పాత పట్టాదారులను ముందుకు తెచ్చి.. తెరవెనక తతంగం నడిపిస్తున్నారు. అయితే వారి కుయుక్తులను కళాశాల పూర్వవిద్యార్థులు, విద్యార్థులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. అంగుళం భూమిని కూడా వదలబోమని, ఇందుకోసం ఎం తటి త్యాగాలకైనా సిద్ధమని పేర్కొంటున్నారు.
సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో ఖరీదైన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను ఎలాగైనా కొల్లగొట్టేందుకు కొన్ని శక్తులు పావులు కదుపుతున్నాయి. పాత పట్టాదారులను తెరపైకి తెచ్చి వారితో కేసులు వేయించడం, వారిని ముందుకు పంపి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేయడం ద్వారా భూ బకాసురులు రూ. 100 కోట్ల విలువైన 8.26 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కు6టలు పన్నుతున్నారు. వాటిని విద్యార్థిలోకం తిప్పికొడుతోంది. కాలేజీకి మొత్తం 268 ఎకరాల భూమి ఉండగా, అందులో వివిధ ప్రభుత్వ అవసరాలకు దాదాపు వంద ఎకరాలకుపైగా భూమిని కేటాయించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా గతేడాది 148 ఎకరాల భూమిని కాలేజీ ఎడ్యుకేషన్ కమిటీ కాలేజీ ప్రిన్సిపల్ పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. అప్పుడు కోర్టు కేసు ఉండడంతో ఈ 8.26 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరగలేదు.
ఇదీ చరిత్ర..
1964లో అప్పటి కలెక్టర్ బీఎన్.రామన్ ఆధ్వర్యంలో కామారెడ్డికి చెందిన ప్రముఖులంతా కలిసి కాలేజీ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. 258 ఎకరాల భూమిని సేకరించి, ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశారు. భవిష్యత్ తరాలకు ఉపయోపడేలా రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టి కాలేజీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. తర్వాతి కాలంలో కళాశాల ఆస్తులు అన్యాక్రాంతం అవుతుండడంతో.. కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విద్యార్థి లోకం అప్పట్లోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టింది. ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ వ్యవహారం కాల్పులదాకా వెళ్లింది. పోరాటాల ఫలితంగా 1987లో ప్రభుత్వం కాలేజీని స్వాధీనం చేసుకుంది. అయితే కాలేజీ సొసైటీ సభ్యులు కోర్టుకు వెళ్లడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో కాలేజీ సొసైటీ పరమైంది. తిరిగి విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా కాలేజీ ప్రభుత్వ ఆధీనంలో కొనసాగినప్పటికీ ఆస్తులు మాత్రం కాలేజీ సొసైటీ పేరిటనే ఉన్నాయి. కాలేజీకి సంబంధించిన 268 ఎకరాల్లో వంద ఎకరాలకు పైగా భూమి ఇతర సంస్థలు, ప్రభుత్వ అవసరాలకు అప్పగించారు. మిగతా భూమిని కాలేజీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని విద్యార్థులు ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేకపోయింది.
జిల్లాల పునర్విభజన అనంతరం..
కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అటు విద్యార్థులు, ఇటు జేఏసీ నేతలు ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు. జిల్లాల పునర్విభజనతో కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించింది. కామారెడ్డి డిగ్రీ కళాశాలలో చదివిన సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌గా వచ్చారు. ఆయన కళాశాల ఆస్తుల పరిరక్షణపై దృష్టి సారించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి కలెక్టర్ ఉన్నత స్థాయిలో చర్చించారు. ప్రభుత్వం ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఉన్న అడ్డంకులపై పలుమార్లు చర్చలు జరిపారు. గతేడాది 148 ఎకరాల భూమిని కాలేజీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే కోర్టు వివాదంలో ఉన్న 8.26 ఎకరాల భూముల విషయాన్ని పెండింగ్‌లో ఉంచారు. ఈ భూమిపై కోర్టులోనే తేల్చుకోవాలనుకున్నారు.
సెలవుల్లో కబ్జాకు యత్నం..
కోర్టు ఇటీవల భూమి కొలతలకు అనుమతి ఇవ్వడాన్ని సాకుగా చూపి పట్టాదారులు కబ్జాకు సిద్ధమయ్యారు. గత శనివారం(సెలవు రోజున) ఉదయమే జేసీబీ, ట్రాక్టర్లతో కాలేజీ గ్రౌండ్‌నంతా దున్నేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి, జేఏసీ, ప్రజాసంఘాల నేతలు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని పనులను నిలిపి వేయించారు.
పోరుబాట..
కళాశాల ఆస్తుల పరిరక్షణ కోసం మంగళవారం అఖిలపక్షం సమావేశమైంది. జేఏసీ కన్వీనర్ జి.జగన్నాథం, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఆహార భద్రత కమిషన్ చైర్మన్ కొమ్ముల తిర్మల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్‌గౌడ్, టీఆర్‌ఎన్‌కు చెందిన డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి వీఎల్ నర్సింహారెడ్డి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి భూమన్న, బహుజన ఐక్యవేదిక నాయకుడు క్యాతం సిద్ధరాములు తదితరలతో పాటు విద్యార్థి, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాలేజీ ఆస్తులను కాపాడుకోవడానికి పోరుబాట పట్టాలని నిర్ణయించారు. 20వ తేదీన కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. మైదానం రక్షణ కోసం ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ. 20 లక్షలు ఇస్తానని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రకటించారు. కాలేజీకి సంబందించిన ఆస్తులన్నీ ప్రజల ఆస్తులని, అంగుళం కూడా వదిలే ప్రసక్తి లేదని అందరూ ముక్తకంఠంతో పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఎంతో మందికి బతుకు బాటలు వేసిన కాలేజీని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
తెరవెనుక ఉన్నదెవరు?
రూ. 100 కోట్ల విలువైన కాలేజీ భూమిని కబ్జా చేయడానికి జరుగుతున్న కుట్రల్లో బడాబాబులు ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఎవరనేది బయటకు వెల్లడి కావడం లేదు. రకరకాల ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల తెరవెనుక తతంగం నడుపుతున్నది ఎవరనేది బహిర్గతం కావడం లేదు. కాగా అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. కాలేజీ ఆస్తులను కాపాడుకునేందుకు అందరం సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment